విజయ్ మాల్యాపై ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్
ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టి విదేశాల్లో తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 2 July 2024 9:00 AM ISTవిజయ్ మాల్యాపై ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్
ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టి విదేశాల్లో తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా విజయ్ మాల్యాకు ముంబై కోర్టు షాక్ ఇచ్చింది. విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ముంబై ప్రత్యేక కోర్టు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకి సంబంధించిన రూ.180 కోట్ల రుణం ఎగవేత కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి నాయక్ నింబాల్కర్ జూన్ 29న ఈ వారెంట్ జారీ చేశారు.
రుణం ఎగవేత కేసులో సీబీఐ సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్నామని న్యాయస్థానం వెల్లడించింది. అలాగే విజయ్‌మాల్యా పరారీలో ఉన్న వ్యక్తి కావడంతో.. ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తున్నట్లు ముంబై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చెప్పారు. ఇక ఇదే కేసులో సీబీఐ విచారణ జరుపుతోంది. ప్రస్తుతం మూతపడ్డ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లై్స్ కంపెనీ ప్రమోటర్ ఉద్దేశపూర్వకంగానే రుణాన్ని ఎగవేసిందనీ.. ప్రభుత్వ ఆధీనంలోని బ్యాంకుకి ఏకంగా రూ.180 కోట్లకు పైగా మొత్తాన్ని చెల్లించకుండా నష్టాన్ని కలిగించారని సీబీఐ కోర్టులో చెప్పింది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ 2007 నుంచి 2012 మధ్య రుణాలను పొందినట్లు సీబీఐ పేర్కొంది. కానీ.. తీసుకున్న రుణాన్ని తిరిగి ఆ కంపెనీ చెల్లించలేదని తెలిపింది. దాంతో.. బ్యాంకును మోసం చేసినందుకు కేసు నమోదు చేసి.. సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మనీల్యాండరింగ్ కేసుల్లో విజయ్ మాల్యా పరారీలో ఉన్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్‌లో దాక్కున్నట్లు తెలుస్తోంది.