మహిళల డ్రెస్‌ చేంజింగ్ రూంలో కెమెరాలు.. చివరకు

మహిళలు బట్టలు మార్చుకునే రూముల్లో కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని అమ్ముకుంటున్నారు ముగ్గురు నీచులు.

By Srikanth Gundamalla  Published on  29 Jun 2023 9:45 PM IST
Secret Camera, Woman Trial Room, Tamil Nadu,

మహిళల డ్రెస్‌ చేంజింగ్ రూంలో కెమెరాలు.. చివరకు 

డబ్బుల కోసం దొంగతనాలు.. హత్యలు చేసేవారు ఉంటారు. వారు ఈజీగానే పోలీసులకు దొరికిపోతారు. కానీ.. మహిళలు బట్టలు మార్చుకునే రూముల్లో కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని అమ్ముకునేవారు కూడా ఉంటారు. చీ డబ్బుల కోసం ఇంత నీచానికి దిగజరుతారా అనుకుంటున్నారా? అవును నిజమే. సినిమాల్లోనే కాదు.. రియల్‌గాను ఇలాంటి నీచపు బుద్ధి ఉన్న కొందరు పట్టుబడ్డారు. తమిళనాడులో జరిగింది ఈ ఘటన. బట్టల షోరూంలో మహిళలు డ్రెస్‌ చేంజ్‌ చేసుకునే రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాను అమర్చారు. ఆ తర్వాత వాటిని అమ్ముకుని డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. ఈ దందా నిందితలు చాన్నాళ్లుగా చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఓ యువతి కళ్లకురిచ్చిలోని ఓ బట్టల షోరూమ్‌కు వెళ్లింది. అక్కడ కొన్ని దుస్తులను సెలక్ట్ చేసుకుని ట్రయల్‌ చేద్దామని.. చేంజింగ్‌ రూమ్‌కి వెళ్లింది. అయితే.. ట్రయల్‌ రూమ్‌ని చూసిన ఆమెకు అనుమానం వచ్చింది. ట్రయల్‌ రూమ్‌లో కెమెరాలు ఉన్నట్లుగా భావించింది. వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఇక వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు. షోరూమ్‌కు వెళ్లారు. ట్రయల్‌ రూమ్‌ని తనిఖీ చేశారు. ఇంకేముంది.. యువతి అనుమానమే నిజమైంది. ట్రయల్‌ రూమ్‌లో ఏర్పాటు చేసిన సీక్రెట్‌ కెమెరాలు బయటపడ్డాయి. దీంతో.. ఒక్కసారిగా అందరూ షాక్‌ అయ్యారు.

ఇదంతా బట్టల షోరూమ్‌లో ఉన్న ముగ్గురు సిబ్బంది చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత వారిని అదుపులోకి తీసుకున్నారు. చాన్నాళ్ల నుంచే సీక్రెట్‌ కెమెరాల ద్వారా అమ్మాయిలు బట్టలు మార్చుకుంటున్న వీడియోలు రికార్డు చేసి.. వాటిని అమ్ముకుంటున్నట్లు పోలీసులు చెప్పారు. స్థానికంగా ఈ వార్త కలకలం రేపుతోంది. అమ్మాయిలు బయట బట్టల షోరూంలకు వెళ్లినప్పుడు ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Next Story