ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో ఊహించని ట్విస్ట్

Sameer Wankhede removed from Aryan Khan drugs case.ఆర్యన్‌ఖాన్‌ క్రూజ్‌ డ్రగ్‌ కేసు దర్యాప్తు నుంచి నార్కొటిక్స్‌

By M.S.R  Published on  6 Nov 2021 10:40 AM IST
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో ఊహించని ట్విస్ట్

ఆర్యన్‌ఖాన్‌ క్రూజ్‌ డ్రగ్‌ కేసు దర్యాప్తు నుంచి నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారి సమీర్‌ వాంఖడేను తప్పిస్తున్నట్టు ఆ ఏజెన్సీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (వాయవ్య జోన్‌) ముతా అశోక్‌ జైన్‌ తెలిపారు. ఈ కేసుతో పాటు మరో ఐదు కేసుల దర్యాప్తు బాధ్యతను ముంబై యూనిట్‌ నుంచి ఢిల్లీ సెంట్రల్‌ యూనిట్‌కు బదిలీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కేసుల దర్యాప్తు వివిధ రాష్ర్టాలతో ముడిపడి ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

కానీ సమీర్ వాంఖడేపై అవినీతి ఆరోపణలు భారీగా వచ్చాయి. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్‌ డైరెక్టర్‌ సమీర్ వాంఖడే పేరు ఇటీవల బాగా పాపులర్ అయింది. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను అరెస్టు చేసిన అధికారి సమీర్. ఆయనపై పెద్ద ఎత్తున లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ సమీర్ పై సంచలన ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. వాంఖడే నకిలీ కుల ధృవీకరణ పత్రాలతో ఉద్యోగం సంపాదించారని ఆరోపించారు.

వాంఖడే మొదటి వివాహానికి సంబంధించిందంటూ ఓ ఫొటోను కూడా ట్వీట్​​ చేశారు. అతడు రూ.70 వేల విలువైన షర్టు, రూ.25–50 లక్షల విలువైన వాచీలు వాడుతుంటారని ఆరోపించారు. నీతి నిజాయితీగల ఒక అధికారి అంతటి ఖరీదైన వస్తువులు ఎలా కొనుక్కోగలడని ప్రశ్నించారు. డ్రగ్స్‌ కేసుల్లో ప్రముఖుల్ని తప్పుడుగా ఇరికించి వారి నుంచి కోట్లు దండుకోవడమే అతను చేస్తున్న పని అని ఆరోపించారు. ఇలాంటి ఆరోపణల మధ్య సమీర్ వాంఖడేను తప్పించింది ఎన్‌సీబీ.

Next Story