ఇండిగో సంస్థకు రూ.1.2 కోట్ల జరిమానా.. ఎందుకంటే..

విమానయాన సంస్థ ఇండిగోకు బ్యూరో ఆఫ్‌ సివిల్ ఏవియేషన్‌ సెక్యూరిటీ భారీ జరిమానా విధించింది.

By Srikanth Gundamalla  Published on  18 Jan 2024 11:38 AM IST
rs.1.2 crore, fine,  indigo airlines, dgca ,

 ఇండిగో సంస్థకు రూ.1.2 కోట్ల జరిమానా.. ఎందుకంటే.. 

విమానయాన సంస్థ ఇండిగోకు బ్యూరో ఆఫ్‌ సివిల్ ఏవియేషన్‌ సెక్యూరిటీ భారీ జరిమానా విధించింది. ఇండిగోతో పాటు ముంబై ఎయిర్‌పోర్టుకు ఈ జరిమానా విధించింది. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఆలస్యమైంది. అయితే.. అప్పటికే ప్రయాణికులను ఎయిర్‌పోర్టు సిబ్బంది రన్‌వే పైకి తీసుకెళ్లారు. అప్పటికే పొగమంచు ఎక్కువగా ఉండటంతో విమానం ఆలస్యమైంది. ఎంత సేపటికీ పొగ మంచు వీడలేదు. దాంతో..విమానం టేకాఫ్ మరింత ఆలస్యమైంది. ఇక ప్రయాణికులు రన్‌వైనే కూర్చొని భోజనం చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిన విషయం తెలిసిందే.

ఈ సంఘటనపై బీసీఏఎస్, డైరెక్టరేట్‌ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ సీరియస్‌గా తీసుకున్నాయి. ప్రయాణికులను తీవ్ర ఇబ్బందికి గురి చేసినందుకు గాను చర్యలు తీసుకున్నాయి. ఎయిర్‌పోర్టులో విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా గదులు ఉంటాయి.. వాటిని వినియోగించకుండా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహించినందుకు చర్యలు తీసుకున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఇండిగో విమానాయ సంస్థతో పాటు ముంబై ఎయిర్‌పోర్టుకు జరిమానా విధించారు. ఇండిగోకు రూ.1.2 కోట్ల జరిమానా, ముంబై ఎయిర్‌పోర్టుకు రూ.90 లక్షల పెనాల్టీ విధించారు. నియమాలను ఉల్లంఘించినందుకే జరిమానా విధించినట్లు డీజీసీఏ, బీసీఏఎస్‌ తెలిపాయి.

వీటితో పాటు స్పైస్‌ జెట్, ఎయిర్ ఇండియా సంస్థలకు డీజీసీఏ జరిమానా విధించింది. ఈ రెండు సంస్థలకు కలిపి రూ.30లక్షల చొప్పున జరిమానా విధించింది. రిఓస్టరింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఎయిర్‌ఇండియా, స్పైస్‌ జెట్‌ విమానయాన సంస్థలకు జరిమానా విధించారు.

Next Story