ఆర్‌జీ కర్‌ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ఇంట్లో ఈడీ సోదాలు

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  12 Sept 2024 10:13 AM IST
ఆర్‌జీ కర్‌ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ఇంట్లో ఈడీ సోదాలు

బెంగాల్‌లోకి కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ఇప్పటీకే సీబీఐ దర్యాప్తు పూర్తి కావొస్తుంది. తాజాగా ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

దాదాపు రెండు వారాల క్రితం ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు ఈడీ అధికారులు ఈ కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే తాజాగా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం ఉదయం నుంచి కోల్‌కతాలోని నాలుగు ప్రదేశాలలో దాడులు నిర్వహిస్తోంది. వీటిలో మాజీ RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కు చెందిన రెండు ఫ్లాట్‌లు ఉన్నాయి. జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటన అనంతరం ఆర్జీ కర్‌ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌ ఆర్థిక అవకతవకల అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దృష్టి సారించారు. ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ తండ్రి సత్య ప్రకాశ్‌ నివాసంలోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా నాలుగు చోట్ల సోదాలు చేస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

మరోవైపు.. డాక్టర్‌ హత్యాచార ఘటనను నిరసిస్తూ డార్టర్లు, వైద్య సిబ్బంది ఆందోళనలు కొనసాగిస్తున్నారు. హత్యాచార ఘటనపై నిర్లక్ష్యం వహించినందుకు సందీప్‌ ఘోష్ సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు 2న, అవినీతి కేసులో డాక్టర్ ఘోష్‌ను సిబిఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత అతన్ని దర్యాప్తు సంస్థ కస్టడీకి పంపింది.

Next Story