ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఊరట
లోక్‌సభ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 28 March 2024 2:45 PM ISTఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఊరట
లోక్‌సభ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఆమెను ఈడీ కస్టడీలో ఉంచుకుని విచారిస్తుండగానే.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ఆయన్ని కూడా ఈడీ కస్టడీకి తీసుకుంది. ప్రస్తుతం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ఈ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు వేస్తున్నారు. కాగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాత్రం ఈడీ కస్టడీ పలుమార్లు ముగిసిన తర్వాత ఇటీవలే కోర్టు ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దాంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు.
కాగా.. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులోనే సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. అరెస్ట్ తర్వాత సీఎం హోదాలోని పనులను కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచే చేస్తున్నారు. దాంతో..ఆయన్ని సీఎం పదవి నుంచి తొలగించాలంటూ ఓ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు అయ్యింది. ఈ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు గురువారం దాన్ని కొట్టివేసింది. దాంతో.. హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు ఊరట లభించినట్లు అయ్యింది. కాగా.. విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఈ కామెంట్స్ చేసింది. కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించలేమని తెలిపింది. అలాగే ఆయన జైలు నుంచే పాలన నడిపించడాన్ని కూడా తాము అడ్డుకోలేమని తెలిపింది. ఈ మేరకు పిటిషనర్‌కు ఈ విషయాలను వివరించింది. కాగా.. ఆర్థిక కుంభకోణంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సీఎం పదవిలో కొనసాగేందుకు అనర్హుడంటూ ఢిల్లీకి చెందిన రైతు, సామాజిక వేత్త సుర్జిత్ సింగ్ యాదవ్ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.