రాజ్యసభ సభ్యుల్లో అత్యధిక సంపన్నులు మనోళ్లే..
రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువలపై ఏడీఆర్ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 10:07 AM ISTరాజ్యసభ సభ్యుల్లో అత్యధిక సంపన్నులు మనోళ్లే..
రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువలపై ఏడీఆర్ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. మొత్తం రాజ్యసభ సభ్యుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఇద్దరు సభ్యులే టాప్‌లో నిలిచారు. అత్యధిక ఆస్తి విలువలతో జాతీయ పార్టీల సభ్యుల కంటే పైస్థానంలో నిలిచారు.
ఏడీఆర్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న బీఆర్ఎస్, వైసీపీకి చెందిన సభ్యులు అత్యంత సంపన్నులుగా నిలిచారు. తొలి రెండు స్థానాల్లో నిలిచారు. బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి, వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డిలు రాజ్యసభలో ఇతర సభ్యుల కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారని ఏడీఆర్ సంస్థ తెలిపింది. పార్థసారథిరెడ్డి ఆస్తుల విలువ రూ.5,300 కోట్లు కాగా.. అయోధ్యరామిరెడ్డి ఆస్తుల విలువ రూ.2,577 కోట్ల మేర ఉన్నట్లు ప్రకటించింది. రాజ్యసభలో మొత్తం 225 మంది సభ్యుల ఆస్తుల విలువ రూ.18,210 కోట్లు కాగా.. అందులో వీరిద్దరి సంపదే 43.25 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఇక బీఆర్ఎస్, వైసీపీలకు చెందిన 16 మంది రాజ్యసభ సభ్యుల వాటా ఏకంగా 86.02 శాతం ఉన్నట్లు ఏడీఆర్ సంస్థ తెలిపింది.
ప్రస్తుతం రాజ్య సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న 233 మంది సభ్యుల్లో 225 మంది అఫిడవిట్‌లను పరిశీలించిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల ఎంపీల తర్వాత మూడో స్థానంలో రూ.1,001 కోట్లతో అమితాబ్ బచ్చన్ సతీమణి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ ఉన్నారు. రాజ్యసభలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి 85 మంది సభ్యులు ఉండగా.. కాంగ్రెస్‌కు 30 మంది సభ్యులు ఉన్నారు. ఈ రెండు పార్టీలకు చెందిన మొత్తం 115 మంది సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.4,128 కోట్లుగా ఉందని ఏడీఆర్ సంస్థ తెలిపింది. ఇక బీఆర్ఎస్, వైసీపీ రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువ రూ.9,157 కోట్ల మేర ఉందని వెల్లడించింది.
పార్టీల వారీగా అయితే.. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువ రూ.5,596 కోట్లు, వైసీపీ సభ్యుల ఆస్తుల విలువ రూ.3,561 కోట్లు, బీజేపీ సభ్యుల ఆస్తుల విలువ రూ.2,579 కోట్లు, కాంగ్రెస్ సభ్యుల ఆస్తి విలువ రూ.1,549 కోట్లు, ఆప్ సభ్యుల ఆస్తి విలువ రూ.1,316 కోట్లు, ఎస్‌పీ పార్టీ సభ్యుల ఆస్తి విలువ రూ.1,019 కోట్లుగా ఉన్నట్లు ఏడీఆర్ సంస్థ నివేదికలో తెలిపింది.
ఇక మొత్తం 225 మంది రాజ్యసభ సభ్యుల్లో 75 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో 41 మంది తీవ్రమైన నేర కేసులు నమోదు అయినట్లు ఏడీఆర్ నివేదికలో తేలింది.