రజనీకాంత్ చేసిన పనిపై నెట్టింట చర్చ, ఫ్యాన్స్ ఫైర్

యోగి ఆదిత్యనాథ్‌ కాళ్లకు సూపర్‌ స్టార్ రజనీకాంత్ నమస్కరించారు. దీనిపై నెట్టింట తీవ్రంగా చర్చ జరుగుతోంది.

By Srikanth Gundamalla  Published on  20 Aug 2023 3:35 PM IST
Rajinikanth, UP CM, Yogi, fans, fire on Trolls,

రజనీకాంత్ చేసిన పనిపై నెట్టింట చర్చ, ఫ్యాన్స్ ఫైర్ 

ఇటీవల సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హిమాలయ శిఖరాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో ఉత్తర్‌ ప్రదేశ్‌ వెళ్లారు. అక్కడ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నటించిన జైలర్‌ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. ఈ క్రమంలో జైలర్‌ సినిమాను సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు చూపించాలని అనుకున్నారు రజనీకాంత్. కానీ.. ఆయనకు కుదరకపోవడంతో డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్తో కలిసి జైలర్ సినిమాను వీక్షించారు. ఆ తర్వాత శనివారం సాయంత్రం సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. అక్కడ రజనీకాంత్‌కు స్వాగతం పలికేందుకు యోగి ఎదురు వచ్చారు. ఆ సమయంలో యోగి ఆదిత్యనాథ్‌ కాళ్లకు సూపర్‌ స్టార్ రజనీకాంత్ నమస్కరించారు. ఇదే వీడియో కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెట్టింట తీవ్రంగా చర్చ జరుగుతోంది.

రజనీకాంత్‌కు 72 ఏళ్లు అని.. కానీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు 51 ఏళ్లేనని తనకంటే చిన్న వయసున్న వ్యక్తి కాళ్లు రజనీకాంత్‌ మొక్కడమేంటని ప్రశ్నలు ప్రారంభించారు. దక్షిణాదికి వెళ్లిన రజనీకాంత్ ఉత్తరాది ప్రజల పరువు తీశారంటూ కొందరు ట్విట్టర్‌లు విమర్శలు గుప్పించారు. ఇక రజనీకాంత్ యాంటీ ఫ్యాన్స్‌ అయితే సూపర్‌స్టార్‌ సినిమాలోని కొన్ని సీన్లను ఉదాహరణగా చూపిస్తూ ట్రోల్స్‌ చేశారు. ఎదుటివారి కాళ్లు మొక్కకూడదు అని సినిమాల్లో రజనీకాంత్.. ఇప్పుడు ఆయన కంటే చిన్న వయసులో ఉన్న సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కాళ్లు ఎందుకు మొక్కారంటూ కామెంట్స్‌లో క్వశ్చర్స్‌ వేస్తున్నారు. దాంతో.. సోషల్‌ మీడియాలో రజనీకాంత్‌ కాళ్లకు నమస్కారం చేసిన దాని గురించే హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రతి ఒక్కరూ దీనిగురించే చర్చించుకుంటున్నారు.

కాగా.. రజనీకాంత్‌ను సోషల్‌ మీడియాలో టార్గెట్‌ చేసి ట్రోల్స్‌ చేయడంపై ఆయన ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్‌ గురించి పూర్తిగా తెలియని వారు మాత్రమే ఆయనపై విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు. యోగి ఆదిత్యనాథ్‌ సీఎం అనో..లేదంటే బీజేపీకి పార్టీకి చెందిన వారు అనో కాళ్లకు నమస్కారం చేయలేదని.. ఆయన ఒక సన్యాసి కాబట్టే గౌరవంగా కాళ్లకు నమస్కారం చేశారని చెబుతున్నారు. హిందూ ధర్మాన్ని రజనీకాంత్‌ పవిత్రంగా భావించే వ్యక్తి అని వివరణ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే సన్యాసిగా ఉన్న యోగి కాళ్లకు నమస్కారం చేశారని రజనీ ఫ్యాన్స్‌ కౌంటర్ ఇస్తున్నారు. గతంలోనూ రజనీ తనకంటే చిన్న వయస్కుడైన సన్యాసి పాదాలకు నమస్కరించారని.. అప్పుడెందుకు సైలెంట్‌గా ఉన్నారంటూ ప్రశ్నించారు. గతంలో రజనీకాంత్ సన్యాసి కాళ్లు మొక్కిన వీడియో మరోసారి షేర్‌ చేస్తున్నారు సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్.

అయితే.. గతంలో ప్రధాని నరేంద్ర మోదీని రజనీకాంత్ చాలాసార్లు కలిశారని.. ఆయనకు ఏరోజు పాదాభివందనం చేయలేని చెబుతున్నారు. ఒక వేళ బీజేపీకి తలవంచి ఉంటే..మోదీ కాళ్లకు మొక్కే వారు కదా అంటున్నారు అభిమానులు. కేవలం సన్యాసి అనే గౌరవంతోనే యోగి కాళ్లకు నమస్కారం చేశారని అభిమానులు వివరణ ఇస్తున్నారు. ఇకనైనా విమర్శలు, ట్రోల్స్‌ మానుకోవాలంటూ కోరుతున్నారు. కాగా.. రజనీకాంత్‌ హీరోగా వచ్చిన జైలర్‌ సినిమా బాక్స్‌ ఆఫీస్‌ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ నెల 10న విడుదలైన ఈ సినిమా పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలుస్తోంది.

Next Story