పట్టాల వెంట పరుగెత్తి.. రైలు ప్రమాదాన్ని తప్పించిన ట్రాక్‌మెన్
విధి నిర్వహణలో ఒక ట్రాక్‌మ్యాన్ చూపించిన సమయస్ఫూర్తి రైలు ప్రమాదాన్ని తప్పించింది.
By Srikanth Gundamalla Published on 8 Sep 2024 1:41 AM GMTవిధి నిర్వహణలో ఒక ట్రాక్‌మ్యాన్ చూపించిన సమయస్ఫూర్తి రైలు ప్రమాదాన్ని తప్పించింది. అతను చూపించిన ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. పట్టాలపై వెల్డింగ్ లోపాన్ని గుర్తించాడు ట్రాక్‌మెన్. అయితే.. అదే సమయంలో ఆ ట్రాక్‌పై రైలు రావడాన్ని చూశాడు. వెల్డింగ్ లోపం ఉన్న ట్రాక్‌పై నుంచి రైలు వెళ్తే ప్రమాదానికి గురవుతుందని.. ట్రాక్‌పై అరకిలోమీటరు మేర పరుగులు తీసి ఆ ట్రైన్‌ను ఆపేలా చేశాడు.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మహాదేవ అనే ట్రాక్‌మ్యాన్ కొంకణ్ రైల్వే డివిజన్‌లో పనిచేస్తున్నాడు. అతను కుమ్టా-హోన్నావర్ స్టేషన్‌ల మధ్య తన విధుల్లో భాగంగా ట్రాక్ ఎలా ఉంది అనే దానిపై తనిఖీ చేపట్టాడు. అప్పుడే తెల్లవారుజాము 4.50 గంటల సమయం అవుతోంది. ఒక చోట పట్టాల జాయింట్ వద్ద వెల్డింగ్ అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించాడు. అయితే.. ఆ మార్గంలో అప్పటికే తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ వస్తోంది. వెంటనే అప్రమత్తమైన అతడు.. కుమ్టా స్టేషన్‌కు సమాచారం అందించాడు. అప్పటికే రైలు ఆ స్టేషన్‌ను దాటేసింది. దీంతో నేరుగా లోకో పైలట్‌ను సంప్రదించేందుకు యత్నించాడు. అదీ విఫలమైంది. ట్రైన్ అలాగే ముందుకు వస్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని గ్రహించి.. సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. రైలుకు ఎదురుగా పరుగు తీశాడు. దాదాపు 5 నిమిషాల్లో అరకిలోమీటరు వెళ్లాడు. లోకోపైలట్‌కు సిగ్నల్ అందించాడు. దాంతో.. అలర్ట్ అయిన లోకోపైలట్ సకాలంలో రైలును ఆపాడు. దాంతో ప్రమాదం తప్పింది. చివరకు వెల్డింగ్ పని పూర్తి చేసిన తర్వాత రైలు గమ్యస్థానానికి బయలుదేరింది. వందలాది ప్రయాణికుల భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహాదేవను ఉన్నతాధికారులు ప్రశంసించారు. అతడిని సత్కరించి, రూ.15 వేల నగదు బహుమతిని అందించారు.