అమేథిలో కిశోరి లాల్‌ భాయ్‌ గెలుస్తారని ముందే తెలుసు: ప్రియాంక గాంధీ

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

By Srikanth Gundamalla  Published on  4 Jun 2024 10:39 AM GMT
priyanka gandhi, amethi lok sabha result, tweet, kishori lal,

అమేథిలో కిశోరి లాల్‌ భాయ్‌ గెలుస్తారని ముందే తెలుసు: ప్రియాంక గాంధీ

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాంతో.. ఎన్నికలకు ముందు అక్కడ ఎవరు నిలబడతారనే ఆసక్తి కూడా కొనసాగింది. ప్రియాంకగాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. అది కుదరలేదు. చివరకు అమేథీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కిశోరి లాల్‌ శర్మను నిలబెట్టింది అధిష్టానం. ఈ క్రమంలో బీజేపీ పలు విమర్శలు చేసింది. అక్కడ కూడా తామే గెలుస్తామంటూ ఎద్దేవా చేసింది.

తాజాగా వెలువడుతున్న ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. అమేథిలో దాదాపు కాంగ్రెస్ గెలుపు ఖాయం అయ్యింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ స్పిందించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అమేథిలో కాంగ్రెస్ గెలుపు కోసం ప్రియాంకగాంధీ చాలా కృషి చేశారు. విస్తృత ప్రచారంలో పాల్గొన్నారు. గెలుపునకు చేరువలో ఉన్న కిశోరీ లాల్‌కు ప్రియాంక గాంధీ ఎక్స్‌ వేదికగా అడ్వాన్స్‌ గ్రీటింగ్స్ చెప్పారు. కిశోరి లాల్‌ భాయ్‌.. మీ గెలుపు ఖాయమని తనకు ముందే తెలుసంటూ ప్రియాంక రాసుకొచ్చారు. కిశోరి భాయ్‌.. మొదటి నుంచి మీ గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేవని ప్రియాంకగాంధీ అన్నారు. కిశోరీ లాల్‌ గెలుస్తారని మొదట్నుంచి చెబుతున్నట్లు వెల్లడించారు. కిశోరీ భాయ్‌తో పాటు.. అమేథిలోని సోదరసోదరీమణులు అందరికీ అభినందనలు చెప్పారు.

సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో తాజాగా ఉన్న సమాచారం ప్రకారం అమేథిలో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరి లాల్ ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో కేంద్రమంత్రి స్మృతి ఇరాని ఉన్నారు. కిశోరీ లాల్‌ శర్మ సమీప అభ్యర్థి స్మృతి ఇరానీపై 12వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ క్రమంలోనే దాదాపు గెలుపు ఖాయం అయ్యిందనీ కాంగ్రెస్‌ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా ప్రియాంక గాంధీ కూడా ఎక్స్‌లో పోస్టు పెట్టడం మరింత ఊపును ఇచ్చింది.

Next Story