జైలులో ఖైదీ బర్త్‌డే పార్టీ.. విచారణకు ఉన్నతాధికారుల ఆదేశం

జైలులో ఖైదీలంతా బర్త్‌డే పార్టీ చేసుకున్నారు. ఒక ఖైదీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on  6 Jan 2024 8:30 AM IST
prisoner, birthday party, celebration,  jail, ludhiana,

జైలులో ఖైదీ బర్త్‌డే పార్టీ.. విచారణకు ఉన్నతాధికారుల ఆదేశం

జైలులో ఖైదీలంతా బర్త్‌డే పార్టీ చేసుకున్నారు. ఒక ఖైదీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే.. వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో కనిపించింది. జైలులో బర్త్‌డే వేడుకలు జరుపుకోవడం.. అదికూడా సోషల్‌ మీడియాలో దర్శనం ఇవ్వడంతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

పంజాబ్‌లోని లుథియానా సెంట్రల్‌ జైలులో ఈ సంఘటన జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఖైదీలు అంతా గుంపుగా కూర్చొని పార్టీ చేసుకున్నారు. ఒక చేతిలో గ్లాసులు పట్టుకుని.. మరో చేతిలో పకోడీలు తింటూ కనిపించారు. ఆ ఖైదీలంతా వీడియోలో ఇలా చెప్పుకొచ్చారు.. నేడు మణి భాయ్‌ పుట్టినరోజు అని పాడుతూ వచ్చారు. జైలులోని ఖైదీలు అరుణ్‌కుమార్ అలియాస్ మణిరాణా పుట్టిన రోజు వేడుకుల జరుపుకున్నారని తెలుస్తోంది. అయితే.. మణిరాణా హిమాచల్‌ప్రదేశ్‌లో 2019లో జరిగిన దోపిడీ కేసులో అండర్‌ ట్రయల్‌గా ఉన్నాడు.

ఇక అతడి బర్త్‌డే పార్టీ జైలులో నిర్వహించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటనపై జైలు అధికారులు కూడా వెంటనే స్పందించారు. వీడియో రికార్డు చేసి, అప్‌లోడ్‌ చేయడానికి ఉపయోగించిన మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఆ ఫోన్ పగిలిపోయిందనీ.. పూర్తి డాటా వెలువడలేదని వారు వెల్లడించారు. ఇక ఈ సంఘటనలో 10 మంది ఖైదీలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు జైలు పోలీసులు తెలిపారు. జైలు చట్టంలోని సెక్షన్ 52-ఏ కింద కేసు నమోదు చేశామని అసిస్టెంట్ కమిషనర్‌ ఆఫ్ పోలీస్‌ గుర్దేవ్‌ సింగ్‌ చెప్పారు.

ఇక సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం.. జైలు అదికారులపై విమర్శలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ సంఘటనపై పాటియాలా డీఐజీ సురీందర్‌సింగ్‌ సమగ్ర విచారణ ప్రారంభించారు. కాగా.. పంజాబ్‌ జైళ్లలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటివి గతంలోనూ జరిగాయి. ఈ నేపథ్యంలో జైళ్లలో భద్రతను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.


Next Story