డిసెంబర్‌ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు 2023 నిర్వహణపై స్పష్టమైన ప్రకటన వెలువడింది.

By Srikanth Gundamalla  Published on  9 Nov 2023 8:03 PM IST
parliament session,  december 4th, pralhad joshi,

డిసెంబర్‌ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు 2023 నిర్వహణపై స్పష్టమైన ప్రకటన వెలువడింది. డిసెంబర్‌ 4 నుంచి శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో వివరాలను తెలిపారు. డిసెంబర్‌ 22 వరకు సెలవులు మినహాయించి 15 రోజుల పాటు ఉభయసభలు సమావేశమవుతాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రకటించారు.

బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలు.. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌ల స్థానంలో.. భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023 లను తేనుంది కేంద్రం. వీటిని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి.. తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన నివేదికలు ఇటీవల హోం మంత్రిత్వ శాఖకు అందాయి. తాజా సమావేశాల్లో వీటిపై చర్చించే అవకాశం ఉంది.

ఐపీసీ (IPC), సీఆర్‌పీసీ (CrPC), ఎవిడెన్స్‌ చట్టాల (Indian Evidence Act) స్థానంలో కేంద్రం ఈ బిల్లులను తీసుకొచ్చింది. వీటితోపాటు ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లులపై ఆమోదం కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 3న వెలువడనుండగా.. ఆ తర్వాతి రోజు నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలు అవుతున్నాయి.

Next Story