పార్లమెంట్‌లో భద్రతా లోపం వ్యవహారంలో 'ఉపా' చట్టం కింద కేసు
పార్లమెంట్‌లో భద్రతా లోపం వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 14 Dec 2023 5:52 AM GMTపార్లమెంట్‌లో భద్రతా లోపం వ్యవహారంలో 'ఉపా' చట్టం కింద కేసు
పార్లమెంట్‌లో భద్రతా లోపం వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సంఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. 'ఉపా' (UAPA) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి నిందతులు మనోరంజన్, సాగర్ శర్మ కలకలం రేపారు. ఇందులో ఒకరు బెంచీలపైకి ఎక్కి 'నిరంకుశత్వం నశించాలి' అని నినాదించాడు. ఈ సంఘటన తర్వాత పార్లమెంట్‌లో భద్రతా లోపంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలా ఎలా ఇద్దరు పార్లమెంట్‌లోకి ప్రవేశించారు? రంగు పొగను వదలడం పై ఎంపీలు కూడా ఆందోళనకు గురయ్యారు.
అయితే.. ఈ సంఘటన జరిగిన వెంటనే పార్లమెంట్‌లో ఉన్న పలువురు స్పందించారు. నిందితుల్లో ఒకరిని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత అతడిని మార్షల్స్‌కు అప్పగించారు. మరోవైపు నీలందీవి, అమోల్‌షిండే పార్లమెంట్ భవనం వెలుపల సైతం పసుపు, ఎరుపు రంగు పొగను వదులుతూ నినాదాలు చేశారు. అనంతరం భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. కుట్రలో లలిత్, విశాల్ అనే మరో ఇద్దరు నిందితులు భాగస్వామ్యం అయ్యారని పోలీసులు తెలిపారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో విశాల్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. లలిత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు చెప్పి షిండే మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోని తన గ్రామం నుంచి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే.. ఈ ఆరుగురు వ్యక్తులు కలిసి సోషల్ మీడియా ద్వారా ఒకరితో ఒకరికి టచ్‌లో ఉన్నారనీ.. ఇది ప్రణాళికాబద్దంగా జరిగిన కుట్ర అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. నిందితులు రెండ్రోజుల కింద ప్లాన్ చేశారనీ.. బుధవారం పార్లమెంట్‌లోకి చేరుకోకముందే రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు. వీరిలో ఐదుగురు పార్లమెంట్లోకి రాకపోముందు గురుగ్రామ్‌లోని విశాల్ నివాసంలో బస చేశారని తెలిపారు. వీరిలో ఇద్దరికి మాత్రమే పాస్‌లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి పూర్తిస్తాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.