మోదీ ప్రభుత్వంపై వీగిన ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం
మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో వీగిపోయింది.
By Srikanth Gundamalla Published on 10 Aug 2023 2:30 PM GMTమోదీ ప్రభుత్వంపై వీగిన ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం
మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో వీగిపోయింది. ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మూజువాణి ఓటింగ్ నిర్వహించారు లోక్‌సభ స్పీకర్. అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు. అంతకుముందు ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వాడీవేడీగా చర్చ కొనసాగింది. అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రతిపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాసం ఎందుకు పెడుతున్నారనే దానిపై స్పష్టత లేదని విమర్శించారు. మరోసారి అయినా అవిశ్వాసం పెట్టినప్పుడు సంపూర్ణ సంసిద్ధతతో వస్తారని ఆశిస్తున్నానని మోదీ ప్రసంగంలో చెప్పారు. అయితే.. లోక్‌సభ నుంచి విపక్షాల ఎంపీలంతా వాకౌట్ చేయడంతో ఓటింగ్ లేకుండానే అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
ఇక మణిపూర్ అంశంపై మాట్లాడిన ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ సంఘటన అమానీవయంగా పేర్కొన్నారు. కాగా.. మణిపూర్ అంశంపై చర్చ విపక్షాలకు అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే హోంమంత్రి అమిత్‌షా పూర్తి వివరాలు అందించారని చెప్పారు. మేం చర్చకు ఆహ్వానిస్తే.. విపక్షాలు సభ నుంచి వెళ్లిపోయారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మణిపూర్ అభివృద్ధికి తాము ఎప్పుడూ అండగా ఉంటామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కొందరు ఎందుకు భారతమాత చావుకోరుకుంటున్నారో అర్థం కావడం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని ముక్కలు చేసేందుకే ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. సభ ప్రజల సొమ్ముతో నడుస్తోందని.. ప్రతి క్షణం విలువైనది అని చెప్పారు. అందుకే సభను ప్రజల అవసరాలను తీర్చే అంశాలపై చర్చించాలని మోదీ అన్నారు. ఇందిరాగాంధీ హయాంలో మిజోరంపై జరిగిన దాడిని ఇప్పటికీ దాచారని.. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని కాంగ్రెస్ విస్మరించిందని అన్నారు ప్రధాని మోదీ.
ప్రధాని మోదీ మాట్లాడుతుండగానే విపక్ష ఎంపీలందరూ సభ నుంచి వాకౌట్ చేశారు. దాంతో.. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగకుండానే వీగిపోయింది.