జూన్ 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. స్పీకర్ ఎవరో..?!
కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 11 Jun 2024 5:07 PM ISTజూన్ 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. స్పీకర్ ఎవరో..?!
కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ప్రధానిగా మూడో సారి నరేంద్ర మోదీ బాధ్యతలు తీసుకున్నారు. ఇక మోదీ 3.0 మంత్రివర్గ కూర్పు కూడా పూర్తయ్యింది. ఇప్పటికే శాఖలను కూడా కేటాయించారు. 71 మంది మంత్రులకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కింది. అందరికీ శాఖలు.. హోదాలను ఖరారు చేశారు. మంగళవారమే దాదాపు అందరు మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. ఈ క్రమంలోనే కేంద్రం పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చింది. ఈ సమావేశాల్లో లోక్‌సభ స్పీకర్ ఎన్నికతో పాటు.. కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణస్వీకారం ఉండనుంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వివరాలను వెల్లడించాయి.
జూన్ 24వ తేదీన ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు.. 8 రోజుల పాటు కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంటే జూలై 3వ తేదీ వరకు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. జూన్ 26వ తేదీన స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు 24, 25 తేదీల్లో కొత్త పార్లమెంట్ సభ్యులంతా ప్రమాణస్వీకారం చేస్తారు. లోక్‌సభ స్పీకర్ పదవిపై ఎన్డీఏ కూటమి పార్టీలు టీడీపీ, జేడీయూ రెండూ ఆశలు పెట్టుకున్నాయి. మరోవైపు లోక్‌సభ స్పీకర్‌గా ఏపీ నుంచి బీజేపీ చీఫ్‌గా ఉన్న పురందేశ్వరికి అవకాశం లభిస్తుందని వార్తలు వినిపించాయి. దీనిపై ఆమెను మీడియా ప్రశ్నించగా.. నవ్వుతూ నమస్కరించి వెళ్లిపోయారు తప్ప క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే 26వ తేదీ వరకు వేచి ఉండక తప్పదు.