జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
దేశంలో చాలా రోజుల నుంచి జమిలీ ఎన్నికలపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 18 Sept 2024 3:23 PM ISTదేశంలో చాలా రోజుల నుంచి జమిలీ ఎన్నికలపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్డీఏ ప్రభుత్వం జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే.. జమిలి ఎన్నికల నిర్వహణపై తాజాగా మరో ముందడుగు పడింది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిడ్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుత ప్రభుత్వ పాలనా కాలంలోనే జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడే కేంద్ర కేబినెట్‌లో జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలపడం సంచలనంగా మారింది.
ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే బిల్లును వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ను వ్యతిరేకిస్తున్నామని.. పార్లమెంట్‌లో బిల్లు పెడితే ఓడిస్తామంటూ కాంగ్రెస్ చెబుతోంది.
ప్రధాని మోదీ 2.0 ప్రభుత్వం ఏకకాల ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మార్చిలో కమిటీ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. ఇటీవల కాలంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం బీజేపీ ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కూడా ప్రస్తావించారు. తరచూ జరుగుతున్న ఎన్నికలు దేశ పురోగతికి అడ్డంకులు సృష్టిస్తున్నాయని వాదించారు. ఈ వారం ప్రారంభంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇదే అంశాన్ని నొక్కి చెప్పారు. ఎన్డీఏ ప్రస్తుత హయాంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు అవుతుందని చెప్పారు.