దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్‌తో పాటు రాత్రి కర్ఫ్యూని విధించారు. ఇదిలా ఉంటే.. కరోనా వచ్చిన వారిని ఇంకా కొంతమంది అంటరానివారిగా చూస్తున్నారు. కరోనా బారిన పడిన వారిని ఆదుకోని, సాయం చేయాల్సింది పోయి సూటిపోటి మాటలు అనడంతో పాటు వారిని చాలా దూరం పెడుతున్నారు. దీంతో కరోనా సోకిన వారు తీవ్ర ఆందోళన చెందుతుండడంతో పాటు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు.
తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెంలో కరోనా వచ్చిందనే భయంతో ఓ వృద్దుడు చెరువుతోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మర్లపాలెం గ్రామానికి చెందిన గాసర్ల హరిబాబు (74) గత మూడు రోజులుగా జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో బాధపడుతున్నాడు. ఆయన పట్ల జాలి చూపించి, అనారోగ్యం నుంచి కోలుకోవడానికి సాయం చేయడం మానేసి.. కుటుంబ సభ్యులతో పాటు చుట్టుప్రక్కల ఉన్న వారు ఆయనపై వివక్ష చూపించారు.
అసలే అనారోగ్యంతో బాధపడుతోన్న ఆ వృద్ధుడు.. గ్రామస్థుల అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. కరోనా నిర్థారణ పరీక్ష చేయించుకోకుండానే భయంతో స్థానిక చెరువుతోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువు లోంచి మృతదేహాన్ని వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.