దేశంలో నిఫా వైరస్ కలకలం, జ్వరంతో ఇద్దరు మృతి
దేశంలో ప్రమాదకరమైన నిఫా వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తోంది.
By Srikanth Gundamalla Published on 12 Sept 2023 3:54 PM ISTదేశంలో నిఫా వైరస్ కలకలం, జ్వరంతో ఇద్దరు మృతి
దేశంలో ప్రమాదకరమైన నిఫా వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తోంది. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో జ్వరం కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దాంతో.. కేరళ ఆరోగ్య శాఖ వెంటనే అప్రమత్తం అయ్యింది. ఈ మరణాలను నిఫా వైరస్ ఇన్‌ఫెక్షన్ కారణమని ఆరోగ్యశాఖ అధికారులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాంతో.. కేరళలోని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిఫా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇద్దరు చనిపోయినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. వీరు నిఫా వైరస్ కారణంగానే చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. మరో ముగ్గురు చిన్నారులతో సహా మొత్తం నలుగురు రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారు తెలిపారు. చనిపోయిన వారిలో ఒకరి బంధువు 22 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలోని ICUలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. నాలుగేళ్లు, తొమ్మిదేళ్లు ఉన్న ఇద్దరు చిన్నారులు.. 10 నెలల శిశువు కూడా ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు అధికారులు. అయితే.. మృతిచెందిన ఇద్దరి నమూనాలను పూణెలోని ల్యాబ్‌కు పంపామని.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో నిఫా వైరస్ పట్ల వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఇంతకుముందు కేరళలోనే నిఫా వైరస్ కేసు తొలిసారిగా బయటపడింది. 2018 మే 19న తొలి కేసు వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈ నిఫా వైరస్ కారణంగా 2018, 2021లో మరణాలు నమోదు అయ్యాయి. జంతువుల నుంచి ఈ వైరస్ వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. కలుషితమైన ఆహారం, ఈ వ్యాధి బారినపడిన వారి నుంచి నేరుగా మరో వ్యక్తికి వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే.. ఈ వ్యాధి లక్షణాలు తొందరగా బయటపడవనీ.. మెదడు వాపునకు కారణం అవుతుందని చెబుతున్నారు.