కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమైంది. మనదేశంలో కూడా మరోసారి కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉందని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన సంగతి తెలిసిందే. ఇక కరోనా మహమ్మారికి విభృంభణకు కళ్లెం వేయడమే లక్ష్యంగా పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 15 రోజులు పాటు రాత్రి పూట కర్ప్యూని విధించాలని ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 1 నుంచి 15 తేదీ వరకు రాత్రి పూట కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు.
నిబంధనలను అతిక్రమించే వారికి విధించే జరిమానాలను కూడా రెట్టింపు చేయనున్నట్లు తెలిపారు. ప్రొటోకాల్ పాటించని వారికి 1000 రూపాయల జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు. రెస్టారెంట్లు, హోటల్స్, వివాహాది వేడుకలు వంటివి రాత్రి 9.30 గంటలలోపు మూసివేయాలని ఆదేశించారు. డిసెంబరు 15 తర్వాత వీటిని సమీక్షిస్తామని తెలిపారు. ఇక ఇప్పటి వరకు పంజాబ్‌లో 1,47,655 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 4,653 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,36,000 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 6,834 యాక్టివ్ కేసులున్నాయి.