ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తదుపరి అధిపతి ఎవరంటే..
ఎయిర్‌ఫోర్స్‌కు తదుపరి చీఫ్‌ను నియమించింది రక్షణ శాఖ.
By Srikanth Gundamalla Published on 21 Sept 2024 4:35 PM IST
భారత సైన్యంలో త్రివిధ దళాలుంటాయి. ఇందులో వాయుసేన ఒకటి. అయితే.. ఈ ఎయిర్‌ఫోర్స్‌కు తదుపరి చీఫ్‌ను నియమించింది రక్షణ శాఖ. నెక్ట్స్ చీఫ్ గా ఎయిర్‌మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ నియామకం అయ్యారు. అయితే.. అమర్ ప్రీత్ ప్రస్తుతం వాయుసేనకు వైస్ చీఫ్‌గా ఉన్నారు. ప్రస్తుతం వాయుసేన అధిపతిగా విధుల్లో ఉన్న మార్షల్ వివేక్ రామ్ చౌదరి పదవీ కాలం త్వరలోనే ముగుస్తుంది. ఈ క్రమంలోనే కొత్తచీఫ్‌ను ఎంపిక ప్రక్రియను ముందుగానే పూర్తి చేశారు. అమర్‌ప్రీత్ సింగ్ సెప్టెంబర్ 30వ తేదీన ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకుంటారు. ఈమేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ 1964 అక్టోబరు 27న జన్మించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ నేషనల్ డిఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1984 డిసెంబర్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి ప్రవేశించారు. దాదాపు 40 ఏళ్ల కెరీర్‌లో కమాండ్, సిబ్బంది, బోధనా, విదేశీ నియామకాలతో సహా అనేక కీలక పదవులను నిర్వర్తించారు అమర్ ప్రీత్ సింగ్. అత్యంత అనుభవజ్ఞుడిగా, ప్రయోగాత్మక టెస్ట్ పైలట్‌గా గుర్తింపు ఆయన పొందారు. ఫ్రంట్‌లైన్ ఎయిర్ బేస్‌కు ఆయన నాయకత్వం వహించారు. అలాగే మాస్కోలో MiG-29 అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ బృందానికి నాయకత్వం వహించారు. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ పరీక్షలను కూడా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పర్యవేక్షించారు.