కేరళ రాష్ట్రానికి కొత్త పేరు.. అసెంబ్లీలో తీర్మానం ఆమోదం
కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 25 Jun 2024 3:30 AM GMTకేరళ రాష్ట్రానికి కొత్త పేరు.. అసెంబ్లీలో తీర్మానం ఆమోదం
కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం పేరును మార్చాలని అసెంబ్లీలో ప్రతిపాదిస్తూ శాసనసభలో పినరయి విజయన్ ప్రభుత్వం సోమవారం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. కేరళ రాష్ట్రాన్ని కేరళంగా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. సీఎం పినరయి విజయన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అయితే.. విపక్షాలు మాత్రం కొన్ని సవరణలను ప్రతిపాదించాయి. కేరల పేరును కేరళంగా మార్చాలని కోరుతూ గతేడాది కూడా ఏకగ్రీవంగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. కానీ.. ఆ ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చింది. ఇక తాజాగా మరోసారి రాష్ట్ర అసెంబ్లీ కేరళ పేరు మార్పుపై తీర్మానాన్ని కేంద్రానికి పంపింది.
కాగా.. రాజ్యాంగం ప్రకారం ఏదైనా రాష్ట్రం పేరును మార్చాలంటే కేంద్రం ఆమోదం ఉండాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోనే పేరును మార్చాల్సి ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం పరిధికి సంబంధించిన అంశం. కాబట్టి.. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన పినరయి విజయన్ ప్రభుత్వం తీర్మానాన్ని కేంద్రానికి పంపించింది. ఈ మేరకు మాట్లాడిన కేరళ సీఎం పినరయి విజయన్.. గతంలో తీర్మానం ప్రకారం రాజ్యాంగంలోని మొదటి, ఎనిమిదో షెడ్యూల్‌లో పేరు మార్చాలని కోరినట్లు వెల్లడించారు. కానీ కేంద్రం మాత్రం మొదటి షెడ్యూల్‌లోనే మార్పు చేయాల్సి ఉందని చెప్పినట్లు సమాచారం.
కేరళం అని పేరు మలయాళమని.. రాజ్యాంగంలో రాష్ట్ర పేరు కేరళగా పేర్కొన్నారని సీఎం పినరయి విజయన్ అన్నారు. కేరళ పేరు మార్చాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తక్షణమే రాజ్యాంగంలో అవసరమైన సవరణలు చేయాలని కోరుతున్నట్లు పినరయి విజయన్ పేర్కొన్నారు. మలయాళంలో కేరళంగా రాష్ట్రాన్ని పిలుచుకుంటామని చెప్పారు. మలయాళీల ఏకీకృత కేరళ డిమాండ్ జాతీయ స్వాతంత్ర్య పోరాటం నుంచి ప్రముఖంగా ఉందని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లోని అన్ని భాషల్లో కేరళం అని రాయాలని సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు.