అయోధ్య వెళ్లాలనుకునే రామభక్తులకు గుడ్‌న్యూస్

దేశంలోని రామభక్తుల కల నెరవేరింది. అయోధ్యలో రామమందిరం ప్రారంభం అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  27 Jan 2024 2:45 AM GMT
new hotels, ayodhya, uttar pradesh govt, ram mandir,

 అయోధ్య వెళ్లాలనుకునే రామభక్తులకు గుడ్‌న్యూస్

దేశంలోని రామభక్తుల కల నెరవేరింది. అయోధ్యలో రామమందిరం ప్రారంభం అయ్యింది. దాదాపు 500 ఏళ్ల తర్వాత ఈ కల సాకారం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులంతా వేడుక చేసుకున్నారు.అయితే.. అయోధ్య బాల రాముడిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఇకపై ఇలాంటి సమస్యలకు చెక్‌పెట్టేందుకు సిద్ధమయ్యారు అధికారు.

అయోధ్య ధామ్‌లో భక్తుల కోసం 158 కొత్త హోటళ్లను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ హోటళ్లను వీలైనంత త్వరగానే భక్తులకు అందుబాటులోకి తెస్తారని సమాచారం. ఈ ఏడాది 8వేల గదులు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతానికి అయోధ్యలో పర్యాటకులకు 175 హోటళ్లు, అతిథి గృహాలు, డేరా సిటీలలో 30వేల మంది భక్తులకు బస చేసేందుకు ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే రిజిస్టర్ అయిన 158 కొత్త హోటళ్ల నిర్మాణం పూర్తయ్యాక అయోధ్య ధామ్‌లోని హోటళ్లు, అతిథి గృహాల సంఖ్య 333కి పెరగనుంది.

ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ అయోధ్యలో నిర్మిస్తున్న హోటళ్లకు స్టార్ హోటళ్ల గుర్తింపు సదుపాయం కల్పిస్తోంది. కాంస్య (ఒక నక్షత్రం), వెండి (రెండు నక్షత్రాలు), బంగారం (త్రీ స్టార్), డైమండ్ (నాలుగు నక్షత్రాలు), ప్లాటినం (ఫైవ్ స్టార్)గా వర్గీకరించే సదుపాయాన్ని కూడా కల్పించింది. కొత్త టూరిజం పాలసీ ప్రకారం కొత్తగా నిర్మితం అవుతున్న ఈ హోటళ్లకు ఇంటి పన్ను, నీటి పన్ను, ఇతర పన్నుల్లో 50 శాతం వరకు రాయితీని కల్పిస్తోంది యూపీ ప్రభుత్వం. ఇక జనరల్‌ కేటగిరీకి 25 శాతం, మహిళలు, షెడ్యూల్డ్‌ కులాలకు 30 శాతం సబ్సిడీ కల్పిస్తోంది. 2024 ఏడాది చివరి నాటికి హోటళ్ల నిర్మాణం పూర్తి కానుందని యూపీ పర్యాటక శాఖ మంత్రి జైవీర్‌ వెల్లడించారు.

Next Story