నేపాల్‌లో గల్లంతైన హెలికాప్టర్ ఘటన విషాదాంతం..ఆరుగురు దుర్మరణం
నేపాల్‌లో అదృశ్యమైన హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు.
By Srikanth Gundamalla Published on 11 July 2023 2:57 PM IST
నేపాల్‌లో గల్లంతైన హెలికాప్టర్ ఘటన విషాదాంతం..ఆరుగురు దుర్మరణం
నేపాల్‌లో మంగళవారం ఉదయం ఓ ప్రైవేట్ హెలికాప్టర్ టేకాఫ్ తీసుకున్న కాసేపటికే అదృశ్యమైంది. హెలికాప్టర్ మిస్ అయిన సంఘటన విషాదంగా మారింది. విదేశీయులతో గాల్లోకి ఎగిరిన హెలికాప్టర్ కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు.
ప్రమాదానికి గురైన హెలికాప్టర్ హెలికాప్టర్ 9ఎన్-ఏంఎవీ (ఏఎస్ 50)హెలికాప్టర్. నేపాల్‌లోని సోలుకుంభు నుంచి ఖాట్మాంటుకు వెళ్తుండగా ఎవరెస్ట్ శిఖరం సమీపంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఐదుగురు మెక్సిన్లతో పాటు ఒక పైలట్ ఉన్నారు. వీరంతా హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ సుర్కీ అనే ప్రదేశం నుంచి టేకాఫ్ తీసుకుంది. టేకాఫ్ తీసుకున్న 15 నిమిషాల తర్వాత కంట్రోల్ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయాయి. అధికారులు ఎంత ప్రయత్నించినా తిరిగి రాడార్‌లోకి రాలేదు. పైలట్‌తో మాట్లాడలేక పోయారు. మంగళవారం ఉదయం 10 గంటలకే ఈ సంఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్ అదృశ్యం కావడంతో మరో హెలికాప్టర్ ద్వారా అధికారులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగినట్లు నేపాల్ సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు.
హెలికాప్టర్ పైలట్‌గా సీనియర్ అయిన చెట్ గురుంగ్ ఉన్నారని చెప్పారు అధికారులు. ఐదుగురు మెక్సికన్ విదేశీయులు కూడా ఉన్నట్లు చెప్పారు. ఎవరెస్ట్ దగ్గర హెలికాప్టర్ కుప్పకూలినట్లు తాము గుర్తించామని చెప్పారు. ఘటనలో హెలికాప్టర్‌లో ఉన్న ఐదుగురు మృతిచెందారని ప్రకటించారు. హెలికాప్టర్‌లో అమర్చిన జీపీఎస్ సంకేతాలు లబ్జురాపాస్ వద్ద నిలిచిపోయాయని అధికారులు పేర్కొన్నారు. హెలికాప్టర్ అదృశ్యమైన సమయంలోనే లిఖుపికే రూరల్ మున్సిపాలిటీ ప్రాంతంలో భారీ శబ్ధం వినిపించిందని స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో.. అధికారులు అక్కడికి వెంటనే చేరుకున్నారు. మిస్ అయిన హెలికాప్టర్ కుప్పకూలినట్లు నిర్ధారించుకున్నారు. పైలట్ చెట్ గురుంగ్‌తో పాటు ఐదుగురు మెక్సికన్‌లు మృతదేహాలను కూడా గుర్తించినట్లు అక్కడి మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.
[Manang Air 9N-AMV (AS50) helicopter crash]प्रेस विज्ञप्ति - २ pic.twitter.com/G7910iGNUQ
— Civil Aviation Authority of Nepal (@hello_CAANepal) July 11, 2023
ఈ ఏడాది జనవరిలో ఖాట్మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు వెళ్తున్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కూడా కుప్పకూలింది. అప్పుడు విమాన ప్రమాదంలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు.