పన్నెండో తరగతి పాఠ్యపుస్తకంలో బాబ్రీ మసీదు పదం తొలగింపు
పన్నెండో తరగతి పాఠ్యపుస్తకంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ స్వల్పమార్పులు చేసింది.
By Srikanth Gundamalla Published on 17 Jun 2024 9:45 AM ISTపన్నెండో తరగతి పాఠ్యపుస్తకంలో బాబ్రీ మసీదు పదం తొలగింపు
పన్నెండో తరగతి పాఠ్యపుస్తకంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ స్వల్పమార్పులు చేసింది. పొలిటికల్ సైన్స్ కొత్త పాఠ్యపుస్తకంలో అయోధ్య వివాదానికి సంబంధించిన పాఠంలో.. బాబ్రీ మసీదు పదాన్ని తొలగించింది. దీని స్థానంలో ‘మూడు డోమ్‌ల నిర్మాణం(త్రీ డోమ్డ్ స్ట్రక్చర్)’ అనే పదాన్ని చేర్చింది. అలాగే పాత పాఠ్యపుస్తకాల్లో ఇదే అంశంపై నాలుగు పేజీల పాఠం ఉండేది. కానీ.. దానిని ఎన్‌సీఈఆర్‌టీ రెండు పేజీలకు కుదించింది. ఎల్ కే అద్వానీ చేపట్టిన రథయాత్ర, కరసేవకుల ఉద్యమం, బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జరిగిన అల్లర్లు, యూపీలో రాష్ట్రపతి పాలన వంటి అంశాలపై వివరణలను కూడా తొలగించింది.
ఎన్‌సీఈఆర్‌టీ పొలిటికల్ సైన్స్ బుక్‌ను రివైజ్ చేయడం 2014 నుంచి ఇది నాలుగోసారి. సమకాలీన రాజకీయ పరిణమాలకు అనుగుణంగా పాఠాల్లోని అంశాలను అప్డేట్ చేస్తున్నామని సంస్థ ఈ మేరకు వివరించింది. పన్నెడో తరగతి క్లాస్ పొలిటికల్ సైన్స్ టెక్ట్స్ బుక్‌లో చేసిన మార్పుల గురించి ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ మాట్లాడారు. పిల్లలకు అల్లర్ల గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ మార్పులపై ఆయన పీటీఐ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. కరికులమ్‌ను కాషాయీకరణ చేస్తున్నారనే ఆరోపణలను ఆయన ఖండించారు. యాన్యువల్ రివిజన్‌లో భాగంగానే మార్పులు చేసినట్లు దినేశ్ ప్రసాద్ సక్లానీ వివరించారు. పాజిటివ్ సిటిజన్‌ను తయారు చేయాలి కానీ.. హింసా ధోరణి పెంచుకునే పౌరులను కాదని అన్నారు. పిల్లల్లో ద్వేషం నింపి, వారిని నేరస్తులుగా మార్చడం విద్య ఉద్దేశం కాదన్నారు ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ.