పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలంటే ఎలెక్ట్రిక్ వాహనాలు తప్పనిసరి అని భావిస్తూ ఉన్నారు అధికారులు. దీంతో పలు ప్రముఖ నగరాల్లో ఎలెక్ట్రిక్ బస్సులను తీసుకుని వస్తూ ఉన్నారు. ముంబై నగరంలో త్వరలో 900 కొత్త డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మొత్తం 48 డబుల్ డెక్కర్ బస్సులు ఉండగా.. త్వరలోనే భారీ అప్‌గ్రేడ్ అవుతుంది. 900 ఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను లీజుపై ప్రవేశపెట్టేందుకు బృహన్ ముంబై విద్యుత్ సరఫరా మరియు రవాణా (బెస్ట్) కమిటీ మంగళవారం ఆమోదం తెలిపింది. వార్తా నివేదికల ప్రకారం అందులో 200 డబుల్ డెక్కర్ AC బస్సులను తీసుకురావడానికి నాలుగు బస్సు తయారీ సంస్థలు ఆసక్తి చూపాయి. మొత్తం 900 బస్సుల భారీ సముదాయాన్ని చేర్చాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
200 AC ఇ-డబుల్ డెక్కర్‌లను కలిగి ఉన్న 2,100 AC ఇ-బస్సులను తీసుకుని రావాలని బెస్ట్ ప్లాన్ చేసింది. మార్చి 2023 నాటికి 50 శాతం ఎలక్ట్రిక్ బస్సులను కలిగి ఉండాలని ప్రతిపాదించింది. మార్చి 2027 నాటికి కేవలం EVలను మాత్రమే కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. 1,400 సింగిల్ డెక్కర్ ఎసి ఇ-బస్సులు, 400 మిడి ఎసి ఇ-బస్సులు, 100 మినీ ఎసి ఇ-బస్సులను తీసుకుని రావాలని భావిస్తోంది. BEST ఈ బస్సుల కోసం ₹ 925 కోట్లకు పైగా నిధులను పొందుతోంది.