భారీ వర్షాలతో కూలిన భవనం.. మహిళ దుర్మరణం

ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి.

By Srikanth Gundamalla  Published on  20 July 2024 10:15 AM GMT
mumbai, rain, building collapse, woman dead ,

 భారీ వర్షాలతో కూలిన భవనం.. మహిళ దుర్మరణం

ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఇప్పటికే రోడ్లన్నీ జలమయం అయ్యాయి. నదులు, చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు అండర్‌పాస్‌ రోడ్లలోకి నీళ్లు చేరుకోవడంతో వాటిని మూసివేశారు పోలీసులు. దాంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడుతున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ.. పాత భవనాల్లో ఉండొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా ముంబైలో వర్షాల కారణంగా ఓ భవనం కుప్పకూలింది.

ముంబైలోని గ్రాంట్‌ రోడ్డులో ఉన్న ఓ భవనంలోని కొంత భాగం కుప్పకూలింది. ఈ ఘటనలో 70 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు విడిచింది. మరో నలుగురికి గాయాలు కాగా.. వెంటనే స్పందించిన పోలీసులు, సహాయక సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రాంట్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలోని స్లీటర్‌ రోడ్డులో నాలుగు అంతస్తుల రూబినిస్సా మంజిల్‌ భవనంలో శనివారం ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బిల్డింగ్‌ రెండు, మూడు అంతస్తుల్లోని బాల్కనీతోపాటు కొంత భాగం కూలిపోయింది. కాగా.. భవనం కూలిపోయిన సమయంలో 35-40 మంది చిక్కుకుని ఉన్నారని అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు వారెవరికీ ఏమీ కాలేదని అన్నారు. ఇక ఆ భవనంలోని ముందు భాగం ప్రమాదకరంగా వేలాడుతూ ఉంది.

ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో శిథిలాల కింద ఇరుక్కుపోయిన వ్యక్తిని రక్షించేందుకు స్థానికులు కాంక్రీట్ స్లాబ్‌లను తొలగిస్తున్న దృశ్యాలు కనిపిస్తు​న్నాయి. గత మూడు రోజులుగా ముంబై సహా పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే బిల్డింగ్ పాతబడి ఉండటం వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Next Story