న్యూఇయర్ రోజున ముంబైని పేల్చేస్తాం.. ఆగంతకుడి ఫోన్‌తో అలర్ట్

న్యూఇయర్‌ రోజున ముంబైలోని పలు చోట్ల పేలుళ్లు జరుపుతామంటూ పోలీసులకే బెదిరింపు కాల్స్ వచ్చాయి.

By Srikanth Gundamalla  Published on  31 Dec 2023 8:17 AM GMT
Mumbai Police, alert,  bomb threat call, new year,

న్యూఇయర్ రోజున ముంబైని పేల్చేస్తాం.. ఆగంతకుడి ఫోన్‌తో అలర్ట్

కొత్త ఏడాదికి వెల్‌కమ్‌ చెప్పేందుకు అంతా సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలో అలజడి మొదలైంది. న్యూఇయర్‌ రోజున ముంబైలోని పలు చోట్ల పేలుళ్లు జరుపుతామంటూ పోలీసులకే బెదిరింపు కాల్స్ వచ్చాయి. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైకి ఇలాంటి బెదిరింపు కాల్ రావడంతో అధికారులంతా అలర్ట్‌ అయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టామన్న హెచ్చరికలతో సోదాలు చేస్తున్నారు.

డిసెంబర్ 30న శనివారం సాయంత్రం 6 గంటల సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్‌ రూమ్‌కు కాల్‌ చేశాడు. నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తాము బాంబులు పెట్టామనీ.. న్యూఇయర్ వేడుకలు జరుగుతున్న వేళ వాటిని పేల్చేస్తామని బెదిరించాడు. దాంతో.. నగర పోలీసులు ఒక్కసారిగా అలర్ట్‌ అయ్యారు. ముంబై అంతా వెళ్లి పలు చోట్లలో బాంబుల కోసం వెతికారు. అంతేకాదు.. వాహనాల రాకపోకలను ఆపి కూడా చెక్ చేశాడు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని ఆపి మరీ ప్రశ్నించడం మొదలు పెట్టారు. నిన్న సాయంత్రం నుంచే ఈ సోదాలు జరిగాయి. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు అని పోలీసులు తేల్చారు. ఎవరో ఆకతాయి వ్యక్తి చేసిన పనిగా పరిగణిస్తున్నట్లు చెప్పారు పోలీసులు .

ఆగంతకుడి ఫోన్‌ కాల్‌ .. మరోవైపు ముంబై పోలీసులంతా నగరంలో సోదాలు జరపడంతో స్థానిక ప్రజలంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. చివరకు ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్‌ కాల్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు ముంబై నగర వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ఇక ఐదు రోజుల క్రితం కూడా ముంబైలోని ఆర్‌బీఐ ఆఫీసులు సహా హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌.. ఇలా మొత్తం 11 ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు దుండగులు బెదిరింపు మెయిల్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా పోలీసులు ముమ్ముర తనిఖీలు చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ.. అనుమానాస్పద వస్తువులు దొరకలేదు.

Next Story