ముంబైలో గాలివాన బీభత్సం.. 14కి చేరిన మృతుల సంఖ్య

ముంబైలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది.

By Srikanth Gundamalla  Published on  14 May 2024 11:14 AM IST
Mumbai, heavy rain, 14 death, hoarding collapse ,


ముంబైలో గాలివాన బీభత్సం.. 14కి చేరిన మృతుల సంఖ్య 

ముంబైలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. పెద్ద ఎత్తున ఈదుగాలులు వీయడంతో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల హోర్డింగులు కుప్పకూలిపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల ఇళ్ల పైకప్పులు గాలివానకు ఎగిరిపోయాయి. ఈ క్రమంలోనే ఘాట్‌కోపర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈదురుగాలుల దాటికి 100 అడుగుల ఎత్తు ఉన్న ఇనుప హోర్డింగ్‌ కుప్పకూలింది. ఈ సంఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను పోలీసులు, సహాయక సిబ్బంది గుర్తించారు. మరో 100 మంది వరకు గాయపడినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. భారీ హోర్డింగ్ కూలిన సంఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో గాలుల ధాటికి ఘాట్‌కోపర్లోని సమతానగర్‌లో భారీ హోర్డింగ్ కూలి రైల్వే పెట్రోల్‌ పంపుపై పడింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను బయటకు తీశారు. కూలిన హోర్డింగ్ కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కూలిన హోర్డింగ్‌ను అక్రమంగా నిర్మించారనీ..ఎలాంటి అనుమతులు తీసుకోలేదని నగరపాలక సంస్థ అధికారులు చెప్పారు.

మరోవైపు బర్కత్‌ అలా నాకాలో శ్రీజీ టవర్ సమీపంలో సాయంత్రం ఈదుగాలులకు మెటల్‌ పార్కింగ్‌ టవర్‌ రోడ్డుపై కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. ఎనిమిది వరకు వాహనాలు ధ్వంసం అయినట్లు అధికారులు చెప్పారు. మరోవైపు ముంబై వ్యాప్తంగా బలమైన గాలులు వీచాయి. కొన్నిచోట్ల భారీ వర్షం పడింది. దాంతో.. స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. కొన్ని చోట్ల కరెంటు వైర్లు తెగిపడిపోయాయి. ఈదురుగాలలు బలంగా వీయడంతో మెట్రో అధికారులు కూడా అప్రమత్తం అయ్యి.. కొన్ని మార్గాల్లో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. సెంట్రల్‌ రైల్వే రెండు గంటలకుపైగా లోకల్‌ రైలు సేవలను నిలిపివేసింది. మరోవైపు గంటకు పైగా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమారు 15 విమానాలను దారి మళ్లించినట్లు తెలిసింది.

హోర్డింగ్ పడిపోవడంతో ముంబై పోలీసులు ఇగో మీడియా యజమానితో పాటు ఇతరులపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 304, 338, 337 సెక్షన్ల కింద భూస్వామి భవేష్ భిండేతో పాటు ఇతరులపై కూడా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇక హోర్డింగ్‌ ప్రమాదం తర్వాత మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే సీరియస్‌గా తీసుకున్నారు. నగరంలోని అన్ని హోర్డింగ్‌లను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకంరగా ఉన్న అన్నింటినీ తొలగించాలని సూచించారు. ఇక హోర్డింగ్ కూలిన సంఘటన చాలా బాధాకరమనీ విచారం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు కచ్చితంగా తీసుకుంటామనీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే హెచ్చరించారు. ఇక మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

Next Story