ముంబైకి భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.
By Srikanth Gundamalla
ముంబైకి భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం కూడా భారీ వర్షాలు కురిశాయి. దాంతో.. నగరం మొత్తం స్తంభించిపోయింది. మంగళవారం కూడా నగరంలో భారీ వర్షం పడుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గత రెండ్రోజులుగా ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తున్న క్రమంలో.. ఐఎండీ హెచ్చరిక ఆందోళనకు గురి చేస్తున్నది. వాతావరణ శాఖ సూచనలతో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ముందస్తు చర్యలలో భాగంగా ముంబై, థానె, నవీ ముంబై, పన్వెల్, పూణెతో పాటు రత్నగిరి-సింధుదుర్గ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, కాలేజీలకు మంగళవారం కూడా సెలవులు ఇచ్చారు. అదే విధంగా ముంబై యూనివర్సిటీలో మంగళవారం జరగాల్సిన పరీక్షలు అన్నింటినీ వాయిదా వేశారు.
సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 7 గంటల వరకు ఏకధాటిగా వర్షాలు పడ్డాయి. దాంతో.. జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. కేవలం ఏడుగంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణశాఖ అధికారులు చెప్పారు. లోతట్టు ప్రాంతలన్నీ నీట మునిగాయి. రహదారులు చెరువులను తలపించాయి. పలుచోట్ల కార్లు, బైకులు నీట మునిగిపోయాయి. కొన్నైతే వరదలో కొట్టుకుపోయాయి. రైలు రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే ట్రాక్‌లపై భారీగా వర్షపు నీరు చేరింది. ప్రతి కూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విమాన సర్వీసులపై ప్రభావం పడింది. పాఠశాలలను కూడా అధికారులు క్లోజ్ చేశారు. పలు చోట్లు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడింది.