ఎయిర్‌పోర్టులో వీల్‌చైర్ లేక నడుస్తూ వెళ్లి వృద్ధుడు మృతి

మహారాష్ట్రలోని ముంబై ఎయిర్‌పోర్టులో విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  16 Feb 2024 3:30 PM IST
mumbai, airport, wheel chair,  old man, died ,

ఎయిర్‌పోర్టులో వీల్‌చైర్ లేక నడుస్తూ వెళ్లి వృద్ధుడు మృతి 

మహారాష్ట్రలోని ముంబై ఎయిర్‌పోర్టులో విషాదం చోటుచేసుకుంది. విమానాశ్రయానికి వచ్చిన ఓ వృద్దుడికి వీల్‌చైర్‌ అందుబాటులో లేకుండా పోయింది. దాంతో.. అతను నడుచుకుంటనే ఎయిర్‌పోర్టు లోనికి వెళ్లాడు. విమానం వద్ద నుంచి ఇమ్మిగ్రేషన్ కౌంటర్‌ వద్దకు నడుస్తూ వెళ్లాడు. దాంతో.. బాగా ఆయాసపడిపోయిన వృద్ధుడు అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఫిబ్రవరి 12వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అమెరికాలోని భారత సంతతికి చెందిన వృద్ధుడు గత సోమవారం తన భార్యతో కలిసి ఎయిరిండియా విమానంలో న్యూయార్క్‌ నుంచి ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. టికెట్‌ కొనుగోలు చేసే సమయంలోనే వీల్‌చైర్‌ ప్రయాణికులుగా వారి పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే.. విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత సదురు వృద్ధ ప్రయాణికులకు వీల్‌చైర్లు అందుబాటులో ఉండలేదు. ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే వీల్‌చైర్ ఇచ్చారు. దాంతో.. వృద్ధుడు తన భార్యను అందులో కూర్చోబెట్టి.. ఆమె వెంట నడుచుకుంటూ వెళ్లాడు. ముంబై ఎయిర్‌పోర్టులో అతను దాదాపు 1.5 కిలోమీటర్లు నడిచి ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్దకు వచ్చాడు. అప్పటికే బాగా అలసి ఆయాసపడ్డ వృద్దుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. ఇక ఇది గమనించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడిని పరిశీలించి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

ఈ సంఘటనపై ఎయిరిండియా యాజమాన్యం కూడా స్పందించింది. ఇది దురదృష్టకర సంఘటన అని పేర్కొంది. ఆ రోజు విమానంలో వచ్చిన ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో వృద్దులు ఉన్నారనీ.. అలాగే వీల్‌చైర్లను ఎక్కువ మంది బుక్ చేసుకున్నారని తెలిపింది. వీల్‌చైర్ వచ్చే వరకు కాసేపు ఆగాలని సదురు ప్రయాణికులకు చెప్పామనీ.. కానీ వారు వినకుండా భార్యవెంటే నడుచుకుంటూ వెళ్లినట్లు ఎయిరిండియా తెలిపింది. ఇక మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నామనీ.. వారికి అవసరమైన సాయం అందిస్తామని ఎయిరిండియా తెలిపింది.

Next Story