ఆధార్‌పై మూడీస్‌ సందేహాలు..తీవ్రంగా ఖండించిన UIDAI

తాజాగా ఆధార్‌పై ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ సంచలన ఆరోపణలు చేసింది.

By Srikanth Gundamalla  Published on  26 Sep 2023 6:17 AM GMT
Moody’s, opinion, aadhaar, biometrics, UIDAI,

ఆధార్‌పై మూడీస్‌ సందేహాలు..తీవ్రంగా ఖండించిన UIDAI 

మనం ఎక్కడికి వెళ్లినా ఆధార్ కంపల్సిరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా.. సర్టిఫికెట్స్‌ కోసం అప్లై చేసుకున్నా ఆధార్ మస్ట్. అయితే.. ఆధార్‌ ద్వారా ప్రతి ఒక్కరికీ కావాల్సిన సంక్షేమం అందుతుందని కేంద్రం దీన్ని తీసుకొచ్చింది. అయితే.. తాజాగా ఆధార్‌పై ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ సంచలన ఆరోపణలు చేసింది. ఆధార్ వల్ల గోప్యత, భద్రతా ముప్పు ఉందని తెలిపింది. అన్ని సమయాల్లో ఆధార్‌ను ఉపయోగించడం విశ్వసనీయత కాదంటూ చెప్పింది.

వరల్డ్‌లోనే అతిపెద్ద డిజిటల్ ఐడీ ప్రొగ్రామ్‌ 'ఆధార్' అని మూడీ సంస్థ పేర్కొంది. అలాగే ‘డీసెంట్రలైజ్డ్‌ ఫైనాన్స్‌ అండ్‌ డిజిటల్ అసెట్స్‌’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. అన్నింటి కోసం ఆధార్‌ను వినియోగించడం ద్వారా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ప్రయోజనాలు చేకూరాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఈ ఆధార్‌ను తీసుకొచ్చింది. దాదాపు అన్ని పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేశారు. అలా చేయడం ద్వారా కచ్చితంగా లబ్ధిదారుడికి పథకం అందుతుంది. అయితే.. దీని వల్ల తరచూ సేవల తిరస్కరణ వంటివి జరుగుతున్నాయని పేర్కొంది మూడీస్‌. బయోమెట్రిక్‌ సరిగ్గా రాక చాలా మందికి సేవలు అందట్లేదని చెప్పింది. తేమ వాతావరణంలో పనిచేసే కార్మికులు ఆధార్‌ను వినియోగించడం అంత విశ్వసనీయమైనది కాదంటూ చెప్పింది.

పౌరుల సున్నితమైన సమాచారం కలిగి ఉన్న ఆధార్‌ వల్ల డేటా ఉల్లంఘన ముప్పు కూడా పొంచి ఉందని మూడీస్ సంచలన ఆరోపణలు చేసింది. బ్యాంకింగ్ అవసరాలు, సామాజిక మాధ్యమాలు, ప్రభుత్వ సంక్షేమాలు ఇలా అన్నింటికీ ఒకే గుర్తింపు కార్డు వినియోగించడం ద్వారా యూజర్ల వ్యక్తిగత డేటా ఇతరులకు చిక్కే ప్రమాదం ఉందని మూడీస్‌ సంస్థ తన నివేదికలో పేర్కొంది.

మూడీస్‌ ఆరోపణలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. మూడీస్ తన నివేదికలో చెప్పిన అభిప్రాయాలను సమర్ధించేలా ఎలాంటి ఆధారాలు చూపించలేదని చెప్పింది. ఆ సంస్థ చేసిన ఆరోపణలను రుజువు చేసే ప్రయత్నమూ చేయలేదని UIDAI ప్రకటనలో వెల్లడించింది. గత పదేళ్లుగా వందకోట్లకు పైగా భారతీయులు ఆధార్‌ను విశ్వసిస్తున్నారని పేర్కొంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ఐడీ ఆధార్‌ అని పేర్కొంది. వేలిముద్ర మాత్రమే కాకుండా.. ఫేస్‌ అథెంటికేషన్, ఐరిస్‌ అథెంటికేషన్ వంటి కాంటాక్ట్‌లెస్‌ మార్గాలను మూడీస్ విస్మరించిందని UIDAI చెప్పింది.

Next Story