మణిపూర్‌లో మరోసారి రీపోలింగ్
మణిపూర్‌లో మరోసారి రీపోలింగ్ నిర్వహించనున్నారు ఎన్నికల సంఘం అధికారులు.
By Srikanth Gundamalla Published on 28 April 2024 12:11 PM IST
మణిపూర్‌లో మరోసారి రీపోలింగ్
మణిపూర్‌లో మరోసారి రీపోలింగ్ నిర్వహించనున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఔటర్ మణిపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఆరు పోలింగ్ స్టేషన్లలో ఈ నెల 30వ తేదీన రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే.. మణిపూర్‌లో ఈ నెల 26వ తేదీన రెండో విడతలో భాగంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆరు పోలింగ్ కేంద్రాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆరు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
దీంతో ఆరు పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్‌ను రద్దు చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆరు చోట్ల రీపోలింగ్ నిర్వహించనున్నట్లు మణిపూర్ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మరోసారి ఓటర్లలంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని మణిపూర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ ఝా కోరారు. కాగా.. గత శుక్రవారం జరిగిన పోలింగ్‌లో ఔటర్ మణిపూర్ లోక్‌సభ స్థానంలో సుమారు 82 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. 4.85 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.