బెంగాల్ సీఎం ఇంట్లోకి చొరబడేందుకు వ్యక్తి యత్నం, అరెస్ట్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంలోకి చొరబడేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు.
By Srikanth Gundamalla Published on 21 July 2023 5:55 PM ISTబెంగాల్ సీఎం ఇంట్లోకి చొరబడేందుకు వ్యక్తి యత్నం, అరెస్ట్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంలోకి చొరబడేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే.. అది గుర్తించిన పోలీసులు అతన్ని అడ్డుకుని అరెస్ట్ చేశారు.
కోల్‌కతాలోని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి ఓ వ్యక్తి చొరబడేందుకు ప్రయత్నించాడు. కారు నడుపుతూ ఇంట్లో వెళ్లేందుకు చూశాడు. అతడి కారులో ఆయుధాలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారు నడుపుతూ సీఎం నివాసం ఉన్న వీధిలోకి ప్రవేశించగానే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అతడు తీసుకొచ్చిన కారుపై పోలీస్ స్టిక్కర్ ఉంది. అయితే.. అనుమానాస్పదంగా వ్యవహరించడంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడి నుంచి ఒక మారణాయుధం, కత్తి, నిషేధిత వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు వివిధ ఏజెన్‌సీలకు చెందిన పలు ఐడీ కార్డులను సదురు వ్యక్తి వద్ద దొరికినట్లు పోలీసులు చెప్పారు.
బెంగాల్ సీఎం నివాసంలోకి చొరబడేందుకు యత్నించిన వ్యక్తి షేక్ నూర్ అలామ్‌గా గుర్తించారు. ఎస్‌టీఎఫ్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిందితుడ్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. కాగా.. ఘటన జరిగిన సమయంలో మమతా బెనర్జీ తన కాళీఘాట్ నివాసంలోనే ఉన్నారు. కోల్‌కతాలో ఏర్పాటు చేసిన అమరవీరుల దినోత్సవం ర్యాలీలో సీఎం మమతా బెనర్జీ పాల్గొనాల్సి ఉండగా.. కొద్ది గంటల ముందే ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే.. పోలీసులకు నిందితుడు పట్టుబడటంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. షేక్ నూర్ అలామ్‌ను ఎవరైనా పంపించారా? ఎందుకు వచ్చాడు..? అంటూ అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజా సంఘటనతో సీఎం నివాసం వద్ద ఉన్న పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది మరింత అలర్ట్ అయ్యారు.