మణిపూర్ ఘటనను తీవ్రంగా పరిగణిస్తే..సీఎంను డిస్మిస్ చేయాల్సింది: ఖర్గే
మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 21 July 2023 7:30 AM GMTమణిపూర్ ఘటనను తీవ్రంగా పరిగణిస్తే..సీఎంను డిస్మిస్ చేయాల్సింది: ఖర్గే
మణిపూర్‌లో ఇటీవల ఒక అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా రోడ్డుపై నడిపించారు. మే నెలలోనే ఈ సంఘటన జరిగినా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా దారుణంగా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఇక ప్రధాన ఇమోదీ, సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.
మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించిన విషయాన్ని గుర్తు చేశారు ఖర్గే. నిజంగానే మోదీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తే... ముందుగా మణిపూర్ సీఎం బీరేన్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని అన్నారు. తొలుతే సీఎం బీరెన్ సింగ్‌ను డిస్మిస్ చేయాల్సిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని తప్పుడు ఆరోపణలు చేయడం మానుకుని.. మణిపూర్‌లో ఇలాంటి సంఘటనలకు కారణమవుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌ను బర్తరఫ్ చేయాలని మల్లికార్జున ఖర్గే అన్నారు.
గత 80 రోజులుగా రెండు వర్గాల ప్రజల మధ్య గొడవలతో మణిపూర్ మొత్తం అట్టుడికి పోతుందని ఖర్గే అన్నారు. అయినా ప్రభుత్వం నోరు మెదపడం లేదని, పూర్తి నిస్సహాయంగా ఉండిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అమానవీయ సంఘటనలు జరుగుతున్నా ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా వ్యవహరిస్తోందని ఖర్గే అన్నారు. మోదీ నిజంగానే మణిపూర్ సంఘటనపై బాధపడి ఉండే సీఎంను డిస్మిస్ చేసేవారని అన్నారు మల్లికార్జున ఖర్గే.