మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని షెగావ్‌లో జరిగిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. తుషార్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనడం చారిత్రకమైనదని కాంగ్రెస్ కొనియాడింది. నవంబర్ 7 నుండి మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర మొదలైంది. ఈరోజు ఉదయం 6 గంటలకు అకోలా జిల్లాలోని బాలాపూర్ నుండి యాత్ర మొదలవ్వగా కొన్ని గంటల తర్వాత షెగావ్ చేరుకుంది, అక్కడ రచయిత, సామాజిక కార్యకర్త తుషార్ గాంధీ యాత్రలో చేరారు. తన జన్మస్థలం షెగావ్ అని తుషార్ గాంధీ గురువారం ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
''నేను 18న షెగావ్‌లో భారత్ జోడో యాత్రలో పాల్గొంటాను. షెగావ్ నా జన్మస్థలం కూడా. అప్పట్లో మా అమ్మ ప్రయాణిస్తున్న హౌరా మెయిల్ వయా నాగ్‌పూర్ 1960 జనవరి 17న షెగావ్ స్టేషన్‌లో ఆగిపోయింది! అప్పుడు నేను పుట్టాను'' అని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లో చెప్పుకొచ్చారు తుషార్ గాంధీ. తుషార్ గాంధీ యాత్రలో పాల్గొనడం చారిత్రాత్మకమని కాంగ్రెస్ అభివర్ణించింది. జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ ముని మనవళ్లు రాహుల్ గాంధీ- తుషార్ గాంధీలు వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది.