గుడ్‌న్యూస్: తగ్గనున్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు శుభవార్త అందించనుంది. వంటగ్యాస్ ధరలను రూ.200 తగ్గించనున్నట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 29 Aug 2023 10:52 AM GMTగుడ్‌న్యూస్: తగ్గనున్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు శుభవార్త అందించనుంది. వంటగ్యాస్ ధరలను రూ.200 తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకుందని సమాచారం. రానున్న ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు వంటగ్యాస్ ధరలను టార్గెట్ చేస్తూ.. కేంద్రంపై విమర్శలు చేస్తున్నాయి. దాంతో.. విమర్శలకు చెక్ పెట్టేందుకు ఎల్‌పీజీ గ్యాస్ ధరలను తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. దాంతో.. సామాన్య ప్రజలకు మేలు చేకూరనుంది.
2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఈ పథకం కింద 5 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో ఈ పథకం తీసుకొచ్చారు. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి అదనంగా రూ.200 చొప్పున రాయితీ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రక్షా బంధన్ సందర్భంగా మోదీ సర్కార్ ఈ శుభవార్త అందించనున్నట్లు తెలుస్తోంది.
ఇంట్లో వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో 1103 రూపాయలుగా ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పలుమార్లు సవరించిన ఆయిల్ కంపెనీలు.. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలను మాత్రం స్థిరంగా ఉంచుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఒక్కో సిలిండర్‌పై రూ.50 చొప్పున పెంచారు. అయితే.. తాజా కేంద్రం నిర్ణయంతో ప్రతిపక్షాలకు కూడా గ్యాస్ సిలిండర్లపై విమర్శలు చేసే అవకాశం కొంత మేర తగ్గుతుంది. పలువురు రాజకీయ నాయకులు ఇది ఎన్నికల కోసమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.