ఎయిర్‌పోర్టులో రూ.10కే భోజనం.. ఎక్కడో తెలుసా?

బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వినూత్న నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరకే టిఫిన్లు, భోజనం అందించాలని చూస్తోంది.

By Srikanth Gundamalla  Published on  24 Dec 2023 10:50 AM IST
low cost food,  bangalore, international airport,

ఎయిర్‌పోర్టులో రూ.10కే భోజనం.. ఎక్కడో తెలుసా?

విమాన ప్రయాణాలు చాలా ఖరీదు అయినవి. ఇది అందరికీ తెలిసిందే. అంతేకాదు.. చాలా మంది విమానాల్లో వెళ్లలేరు. అది వారి ఆర్థిక పరిస్థితే కారణం కావొచ్చు. కొందరు మాత్రం డబ్బులు దాచుకుని మరీ విమానాల్లో ఎక్కడానికి ఆసక్తి కనబరుస్తారు. ఇక ఎయిర్‌పోర్టుల్లో చాలా రకాల రెస్టారెంట్లు ఉంటాయి. వాటిల్లో ఉండే ఆహార పదార్థాల ధర కూడా విమాన చార్జీల్లానే ఎక్కువగా ఉంటుంది. సామాన్యులు కొనే పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వినూత్న నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరకే టిఫిన్లు, భోజనం అందించాలని చూస్తోంది.

బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఖరీదైన ఫుడ్‌ అవుట్‌లెట్లలో కూడా సామాన్యులు, మధ్యతరగతి వారు తేలిగ్గా తీసుకునేలా అక్కడి ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కర్ణాటక వ్యాప్తంగా 'ఇందిరా క్యాంటీన్' అందుబాటులో ఉంది. దీంట్లో భాగంగా తక్కవ ధరకే భోజనాలు అందిస్తోంది ప్రభుత్వం. ఇదే క్యాంటీన్‌ను బెంగళూరు ఎయిర్‌పోర్టులోని పార్కింగ్ ప్రదేశంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎయిర్‌పోర్టు పార్కింగ్ ప్రదేశంలో రెండు క్యాంటిన్లను ఏర్పాటు చేస్తోంది. త్వరలోనే ప్రభుత్వం ఈ క్యాంటిన్లను ప్రారంభించనుంది. కాగా.. ఒక్క బెంగళూరులోనే 175కి పైగా ఇందిరా క్యాంటిన్లు ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగరాల్లో, పట్టణాల్లో ఇందిరా క్యాంటిన్లలో రూ.5కే టిఫిన్లు, రూ.10కే భోజనాన్ని అందిస్తోంది కర్ణాటక ప్రభుత్వం.

ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుల్లో కప్పు టీ లేదా కాఫీకే రూ.200 నుంచి రూ.500 వరకు ఉంటాయి. ఇక భోజనాలు అయితే రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు దగ్గర తక్కువ ధరకే టీలు, టిఫిన్లు, భోజనాలు లభించడం ద్వారా మధ్యతరగతి వారికి ఉపశమనం లభించనుంది.

Next Story