లోక్‌సభ ఎన్నికల్లో చెప్పుల దండతో ఓ అభ్యర్థి ప్రచారం.. ఎందుకంటే..

మెడలో చెప్పుల దండ వేసుకుని ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి ఓటు తనకు వేయాలని అభ్యర్ధిస్తున్నాడు.

By Srikanth Gundamalla  Published on  9 April 2024 8:38 AM GMT
lok sabha election, campaign,  chappals, aligarh,

లోక్‌సభ ఎన్నికల్లో చెప్పుల దండతో ఓ అభ్యర్థి ప్రచారం.. ఎందుకంటే..

దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఎప్పుడో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. దేశంలో ప్రస్తుతం ఎలక్షన్ కోడ్‌ అమల్లో ఉంది. మరో వైపు రాజకీయ పార్టీలు కూడా లోక్‌సభ ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేశాయి. ఆయా స్థానాల నుంచి సీట్లు దక్కించుకున్నవారు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. దాంతో.. ఎక్కడ చూసినా సభలు, సమావేశాలతో ప్రచారం హోరెత్తుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ స్వతంత్ర అభ్యర్థి వార్తల్లో నిలిచాడు. అతను తన మెడలో చెప్పుల దండ వేసుకుని ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి ఓటు తనకు వేయాలని అభ్యర్ధిస్తున్నాడు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆ లోక్‌సభ అభ్యర్థి చెప్పుల దండను మెడలో వేసుకుని ప్రచారం చేయడానికి వెనుక కారణం లేకపోలేదు. అలీగఢ్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పండిట్‌ కేశవ్‌ దేవ్‌ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఎన్నికల సంఘం కేశవ్‌ దేవ్‌కు జోడు చెప్పుల గుర్తుని కేటాయించింది. దాంతో.. ఆయన ఆ చెప్పులనే పూలదండగా వేసుకుని.. వెరైటీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రోడ్డుపై అతను అలా చెప్పుల దండతో తిరుగుతుండగా చూసిన జనమంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇక ఎందుకలా చేస్తున్నాడనే విషయం తెలుసుకుని ముక్కున వేలేసుకుంటున్నారు. దాంతో.. ఆయన ఒక్కసారిగా ఫేమస్‌ అయిపోయారు. మరి పోలింగ్‌ వేళ ఏ మేరకు కేశవ్‌ దేవ్‌కు ప్రజలు మద్దతు తెలుపుతారో చూడాలి.

కాగా.. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19వ తేదీ నుంచి ఏడు దశల్లో దేశవ్యాప్తంగా జరగబోతున్నాయి. అత్యధికంగా 80 ఎంపీ స్థానాలు ఉన్న ఉత్తర్‌ ప్రదేశ్‌లో 7 దశల్లో పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 19న మొదటి దశ, ఏప్రిల్ 26న రెండో దశ, మే 7న మూడో దశ, మే 13న నాలుగో విడత, మే 20న ఐదో విడత, మే 23న ఆరో విడత, జూన్ 1వ తేదీన ఏడో విడత ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అలీగఢ్‌ పార్లమెంట్‌ స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. కాగా.. ఫలితాలను జూన్‌ 4వ తేదీన విడుదల చేయనున్నారు.


Next Story