కోర్టులోకి వెల్లుల్లి తీసుకెళ్లిన లాయర్.. జడ్జి సీరియస్!

ఉత్తర్‌ ప్రదేశ్‌ అలహాబాద్‌ హైకోర్టులో విచిత్ర సన్నివేశం జరిగింది.

By Srikanth Gundamalla  Published on  29 Sept 2024 2:48 PM IST
కోర్టులోకి వెల్లుల్లి తీసుకెళ్లిన లాయర్.. జడ్జి సీరియస్!

ఉత్తర్‌ ప్రదేశ్‌ అలహాబాద్‌ హైకోర్టులో విచిత్ర సన్నివేశం జరిగింది. హైకోర్టుకు ఓ న్యాయవాది వెల్లుల్లిని తీసుకువచ్చాడు. దాంతో.. ఇది చర్చనీయాంశం అయ్యింది. చైనా నుంచి ఇండియాకు ఒకప్పుడు వెల్లుల్లి దిగుమతి జరిగేది. అయితే.. అందులో రసాయనాలు, పురుగుల మందులు ఎక్కువగా ఉన్నాయనీ.. 2014 నుంచి నిషేధం విధించారు. ఏళ్లు గడుస్తున్నా.. చైనా వెల్లుల్లి ఇంకా కనిపిస్తూనే ఉంది. దాంతో.. ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయవాది మోతీలాల్ యాదవ్.. అలహాబాద్ కోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఇండియాలో ఇంకా చైనా వెల్లుల్లి దొరుకుతుందనీ చెప్పడానికి.. దాన్ని స్వయంగా చూపించేందుకు ఆయన అరకిలో వెల్లుల్లిని కోర్టుకు తీసుకెళ్లారు. అలాగే.. మన దేశంలో పండే సాధారణ వెల్లుల్లిని కూడా తీసుకెళ్లారు. మోతీలాల్‌ యాదవ్ దాఖలు చేసిన పిల్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది. చైనా వెల్లుల్లి విక్రయాలపై అలహాబాద్ హైకోర్టు సీరియస్ అయింది. 2014లోనే చైనా వెల్లుల్లిపై మన దేశంలో నిషేధం విధించినా.. ఇంకా మార్కెట్లో ఎలా విక్రయిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది.

నిషేధిత వస్తువులు దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకునే అధికార యంత్రాంగానికి తగిన సూచనలు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని నిషేధించిన చైనా వెల్లుల్లి ఎలా వస్తుంది? వాటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని యూపీ సర్కార్‌కు కోర్టు ఆదేశించింది. గతంలో చైనా నుంచి భారత్‌లోకి ఫంగస్ సోకిన వెల్లుల్లి దిగుమతి అవుతోందని గతంలో నివేదికలు వచ్చాయి. చైనా వెల్లుల్లిలో పురుగు మందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. దాంతో.. 2014లో కేంద్ర ప్రభుత్వం చైనీస్ వెల్లుల్లిపై నిషేధం విధించింది.

Next Story