సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరిపింది మేమే!!

ప్రముఖ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల కలకలం రేగింది.

By Srikanth Gundamalla  Published on  14 April 2024 5:30 PM IST
lawrence bishnoi brother,  firing, salman khan, home,

సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరిపింది మేమే!! 

ప్రముఖ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల కలకలం రేగింది. ఆదివారం తెల్లవారుజామున 4.51 గంటలకు బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతుకులు ముంబైలోని గ్యాలెక్సీ అపార్ట్‌మెంట్ ముందు గాల్లో కాల్పులు జరిపి పారిపోయారు. తొలుత మూడు రౌండ్లు, ఆపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి వెళ్లిపోయారు.అప్రమత్తమైన పోలీసులు సల్మాన్ ఇంటిముందు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

ఈ కాల్పులకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ బాధ్యత వహించాడు. అన్మోల్ అందుకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు. అన్మోల్ భారతదేశంలో వాంటెడ్ క్రిమినల్.. ప్రస్తుతం అతడు యుఎస్‌లో దాక్కున్నాడు. సల్మాన్ ఖాన్ కు హెచ్చరిక జారీ చేస్తూ ఈ కాల్పులు కేవలం "ట్రైలర్" మాత్రమేనని అన్నారు. సల్మాన్ ఖాన్‌ను మట్టుబెడతామని గతంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. 2018లో బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు సంపత్ నెహ్రా సల్మాన్ ఖాన్‌ ఇంటి ముందు రెక్కీ నిర్వహించాడు. అతడు దాడికి తెగబడకముందే పోలీసులకు చిక్కడంతో సల్మాన్‌‌పై దాడి ప్లాన్ పోలీసులకు తెలిసింది. సిద్ధూ మూస్ వాలా హత్య కేసులో అన్మోల్ బిష్ణోయ్ అలియాస్ భాను పరారీలో ఉన్న నిందితుడు. అతను నకిలీ పాస్‌పోర్ట్‌తో భారతదేశం నుండి పారిపోయాడని గత సంవత్సరం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) ఛార్జిషీట్ వేసింది.

Next Story