నేడు చివరి దశ ఎన్నికల పోలింగ్.. సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 1 Jun 2024 1:29 AM GMTనేడు చివరి దశ ఎన్నికల పోలింగ్.. సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు దశల్లో ఎన్నికల పోలింగ్ జరగ్గా.. జూన్ 1న ఏడో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. చివరి దశలో భాగంగా 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 10.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని 13 లోక్‌సభ స్థానాలు, బీహార్‌లో 8, బెంగాల్‌లో 9, ఒడిశాలో 6, జార్ఖండ్‌లో 3, పంజాబ్‌లో 13, హిమాచల్ ప్రదేశ్‌లోని 4 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ఇక ఇవాళే ప్రధాని మోదీ పోటీ చేస్తున్న యూపీలోని వారణాసి స్థానానికి కూడా పోలింగ్ జరుగుతుంది. వారణాసి నుంచి ప్రధాని మోదీకి ప్రత్యర్ధిగా కాంగ్రెస్ నుంచి అజయ్‌రాయ్ బరిలోకి దిగారు. ఇప్పటికే రెండు సార్లు ప్రధాని మోదీ వారణాసి నుంచి గెలిచారు. అయితే.. ఈసారి మాత్రం అజయ్‌రాయ్ మోదీకి కూడా గట్టి పోటీ ఇస్తారని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో పంజాబ్‌లోని 13 స్థానాల్లో 8 స్థానాలను గెలిచిన కాంగ్రెస్ ఈ సారి అంతకుమించి గెలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఆప్ కూడా అక్కడ గట్టి పోటీ ఇస్తోంది. బీహార్ రాజధాని పాట్నా, నలందా, పాటలీపుత్ర, అర్హా, ససారామ్, బక్సర్ వంటి స్థానాల్లో కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, ఆరేకే సింగ్ బరిలో ఉన్నారు.
ఇక ఇవాళే చివరి దశ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ పూర్తి కానున్న విషయం తెలిసిందే. అయితే.. రాజకీయ నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఎగ్జిట్ పోల్స్ పట్ల ఆసక్తిగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా నిజం కాకపోయినా.. కొంత మేర అవగాహనకు రావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ముఖ్యంగా అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్‌పైనే ఉంది. ఎవరు రాష్ట్రంలో అధికారంలోకి వస్తారనేది ఉత్కంఠగా మారింది. కాగా.. రాష్ట్రంలో ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీలు ఉమ్మడిగా పోటీ చేశాయి. వైసీపీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అధికార మార్పు జరుగుతుందా లేదా అన్నది చర్చనీయాంశం అవుతోంది.