సీఎం మమతకు పిల్లలుంటే నా బాధ తెలిసేది: వైద్యురాలి తల్లి

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో వైద్యురాలిపై హత్యాచార సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది

By Srikanth Gundamalla  Published on  30 Aug 2024 12:30 PM IST
సీఎం మమతకు పిల్లలుంటే నా బాధ తెలిసేది: వైద్యురాలి తల్లి

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో వైద్యురాలిపై హత్యాచార సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆమెకు న్యాయం జరగాలంటూ వైద్య విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే రోజుకో మలుపు తిరుగుతోంది. సీబీఐ విచారణ చేపట్టినా ఇప్పటికీ వైద్యురాలి సంఘటనలో దర్యాప్తు పూర్తవ్వలేదు. అయితే.. వైద్య విద్యార్థినిపై హత్యాచార సంఘటనకు నిరసనగా పశ్చిమ బెంగాల్‌ బంద్‌కు బుధవారం బీజేపీ పిలుపునిచ్చింది. ఈ బంద్‌లో పలు చోట్ల ఉద్రిక్త సంఘటనలు జరిగాయి. వీటిపై స్పందించిన ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ బంద్‌ను తప్పుబట్టారు. వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేశారు. సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై తాజాగా హత్యాచార బాధితురాలి తల్లి స్పందించింది. మమతా బెనర్జీపై కీలక కామెంట్స్ చేసింది.

నిరసనలకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ మాట్లాడటాన్ని వైద్యురాలి తల్లి ఖండించారు. ఆవిడ చేసిన వ్యాఖ్యలు తనకు నచ్చలేదన్నారు. తన కూతురిపై జరిగిన అఘాయిత్యానికి వ్యతిరేకంగా అంతా న్యాయం కోసం పోరాడుతున్నారని.. నిందితులకు శిక్ష పడే వరకు విద్యార్తులు విశ్రమించరని అన్నారు. ఈ విషయంలో ప్రపంచం మొత్తం తన కూతురికి అండగా నిలుస్తోందని వైద్యురాలి తల్లి తెలిపింది. కన్నబిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న తమను మమతా చేసిన వ్యాఖ్యలు మరింత బాధించాయన్నారను. ఆమెకు పిల్లలు లేరనీ.. అందుకే వారిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆమెకు తెలియదంటూ వ్యాఖ్యానించారు వైద్యురాలి తల్లి.

కాగా.. అంతకుముందు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. హత్యాచార నిందితులకు మరణశిక్ష విధించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమం చేపడతామనీ.. జూనియర్ వైద్యులు విధుల్లో చేరాలని ఆమె కోరారు. మరోవైపు ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని గురువారం చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని, విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి పాస్‌పోర్ట్‌, వీసా కూడా లభించదని సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

Next Story