వయనాడ్‌లో బాధితులు విడిచిన పెట్టిన ఇళ్లలో దొంగతనాలు
కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయం సృష్టించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 4 Aug 2024 3:30 AM GMTవయనాడ్‌లో బాధితులు విడిచిన పెట్టిన ఇళ్లలో దొంగతనాలు
కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయం సృష్టించిన విషయం తెలిసిందే. కొండచరియలు విరిగిపడి 300కి పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కేరళ చరిత్రలోనే ఇది అతిపెద్ద మనవతా సంక్షోభంగా చెబుతున్నారు. ప్రభుత్వాలు, ప్రముఖులు అంతా బాధితులకు అండగా నిలబడుతున్నారు. సాయం చేస్తున్నారు. అయితే.. ప్రకృతి సృష్టించిన విలయంలో కూడా కొందరు దొంగతనాలు చేస్తున్నారు. కొంచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమైన విషయం తెలిసిందే. దాంతో.. బాధితులు దెబ్బతిన్న ఇళ్లను వదలిపెట్టి వెళ్లారు. పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారు.
దెబ్బతిన్న ఇళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయి. జనాలు విడిచి పెట్టిన ఇళ్లలో దొంగలు పడుతున్నారు. ఈ విషయం తెలిసిన బాధితులు పునరావాస కేంద్రం నుంచి తమ ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా మంది బాధితులు తమ ఇళ్లలో దొంగతనాలు జరిగాయంటూ పోలీసులు ఫిర్యాదులు చేశారు. రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడే వారిని గుర్తించి శిక్షించాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. దీంతో విలయ ప్రాంతాలలో పోలీసులు రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. చూరల్మల, ముండక్కై సహా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి వేళ పోలీసులు గస్తీ కాస్తూ .. ఇళ్లలో చోరీలు జరగకుండా చూసుకుంటున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం పోలీసులు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
అనుమతి లేకుండా రాత్రి సమయాల్లో బాధిత ప్రాంతాల్లోకి, బాధితుల ఇళ్లలోకి ఎవరూ రావొద్దని చెప్పారు. సూచనలు పట్టించుకోకుండా వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ పోలీసులు హెచ్చరించారు. రెస్క్యూ ఆపరేషన్ల పేరుతో, ఇతర కారణాలతో ఇళ్లలోకి ప్రవేశించడానికి వీలులేదని స్పష్టం చేశారు.