కేరళలో భారీ పేలుళ్లు, ఒకరు మృతి, 23 మందికి గాయాలు

కేరళలోని కాలామస్సేరిలో ఆదివారం ఉదయం పేలుళ్ల సంఘటన కలకలం రేపింది.

By Srikanth Gundamalla
Published on : 29 Oct 2023 1:02 PM IST

kerala, serial blasts, convention hall, one dead,

కేరళలో భారీ పేలుళ్లు, ఒకరు మృతి, 23 మందికి గాయాలు

కేరళలోని కాలామస్సేరిలో ఆదివారం ఉదయం పేలుళ్ల సంఘటన కలకలం రేపింది.. ఈ పేలుళ్లలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో 23 మంది గాయాలపాలయ్యారు. కాలా మస్సేరి నెస్ట్‌ సమీపంలోని ఓ కన్వేషన్‌ సెంటర్‌లో ఉదయం 9.30 గంటల సమయంలో ఈ పేలుళ్లు సంభవించాయి. అయితే.. పేలుళ్లు జరిగిన సమయంలో అక్కడ వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది

కన్వెన్షన్‌ హాల్‌లో మూడు నుంచి నాలుగు సార్లు పేలుళ్లు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. కన్వెన్షన్‌ హాల్‌లో దాదాపు 2,500 మంది ఉన్నట్లు సమాచారం. కన్వెన్షన్‌ హాల్‌లో ప్రార్థనకు వరపూజ, అంగమలి, ఎడపల్లి నుంచి భారీగా జనాలు తరలివచ్చారు. అయితే.. ప్రార్థన సమయంలో అందరూ కళ్లు మూసుకుని ఉండగా.. హాలు మధ్యలో భారీ పేలుడు సంభవించింది. అనంతరం.. మరో రెండు మూడు పేలుళ్లు కూడా జరిగాయి. మొదటిదానితో పొలిస్తే మిగతా రెండు కాస్త చిన్నవిగానే ఉన్నాయని సమాచారం. కాగా.. కన్వెన్షన్‌ సెంటర్‌ లోపలి వైపు నుంచి తాళం వేసి ఉంది. దాంతో.. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించడంలో ఆలస్యం అయ్యింది. కాగా.. పేలుళ్ల ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందని తెలుస్తోంది. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఇప్పటికే ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ పేలుళ్ల సంఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఇది ఘటన దురదృష్టకరమని.. దీనిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఉన్నతాధికారులు అంతా ఎర్నాకులంలో ఉన్నారనీ.. డీజీపీ కూడా ఘటనాస్థలిని పరిశీలిస్తారని అన్నారు. ఈ పేలుళ్లను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్ అన్నారు. ఇప్పటికే డీజీపీతో మాట్లాడాను అని.. దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడి అవుతాయని కేరళ సీఎం పినరయి విజయన్‌ చెప్పారు.

Next Story