పెళ్లిలో ట్విస్ట్.. వధువుని లాక్కెళ్లిన పోలీసులు.. ఎందుకంటే

కేరళలోని కోవలం ప్రాంతానికి చెందిన అల్ఫియా అనే అమ్మాయి అఖిల్‌ను ప్రేమించింది. ఇద్దరి మతాలు వేరు.

By Srikanth Gundamalla  Published on  19 Jun 2023 4:15 PM IST
Kerala Police, Bride, Marriage

పెళ్లిలో ట్విస్ట్.. వధువుని లాక్కెళ్లిన పోలీసులు.. ఎందుకంటే

ప్రేమ వివాహాలు అంత ఈజీగా జరగవు. ఇంట్లో కుటంబ సభ్యులను ఒప్పించాల్సి ఉంటుంది. ఇక కులాలు, మతాలు వేర్వేరు అయితే అది మరింత కష్టం అవుతుంది. కొన్నిసార్లు పెద్దలు ఒప్పుకుంటే.. చాలా సార్లు ఇలాంటి పెళ్లిళ్లకు వారి నుంచి నిరాకరణ ఉంటుంది. ఈ క్రమంలోనే కేరళలో కులాంతర వివాహం చేసుకుంటున్న ఓ జంటకు అనుకోని సంఘటన ఎందురైంది. కాసేపట్లో వధువు మెడలో వరుడు తాళి కడతాడనగా సడెన్‌గా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వధువుని బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కేరళలోని కోవలం ప్రాంతానికి చెందిన అల్ఫియా అనే అమ్మాయి అఖిల్‌ను ప్రేమించింది. ఇద్దరి మతాలు వేరు. కాబట్టి ఇంట్లో వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ ప్రేమికులు ఇద్దరూ విడిపోయి బతకలేమని అనుకున్నారు. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ప్లాన్‌ ప్రకారం స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కొద్ది క్షణాల్లో వరుడు వధువు మెడలో తాళి కట్టాల్సి ఉంది. అప్పుడే ఎంట్రీ ఇచ్చారు పోలీసులు. పెళ్లిని ఆపేశారు. పెళ్లి పీటలపై కూర్చొని ఉన్న అల్ఫియాను బలవంతంగా లాక్కెళ్లారు. అల్ఫియా నేను రాను ఇష్ట ప్రకారమే తాను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పినా పోలీసులు వినలేదు. అక్కడి నుంచి తీసుకెళ్లి వారిని కోర్టులో హాజరుపర్చారు.

కోర్టులో అల్ఫియా తాను ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి చేసుకుంటున్నట్లు గట్టిగా చెప్పింది. దీంతో.. కోర్టు వారి పెళ్లికి అనుమతిచ్చింది. ఆ తర్వాత వారిని ఎవరూ ఆపలేకపోయారు. కాగా.. పెళ్లి కూతురిని పోలీసులు లాక్కెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై స్పందించిన పోలీసులు యువతి కుటుంబ సభ్యులు.. తమ కూతురు అదృశ్యమైందని కంప్లైంట్‌ ఇచ్చారు.. అందుకే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కోర్టు వారి పెళ్లిని అంగీకరించడంతో ప్రేమజంట వెళ్లిపోయారని చెప్పారు.

ఈ వ్యవహారంపై అల్ఫియా, అఖిల్‌ కూడా మాట్లాడారు. పెళ్లి జరుగుతున్న సమయంలో పోలీసులు చాలా దారుణంగా వ్యవహరించారని వారు మండిపడ్డారు. ఇష్టప్రకారమే పెళ్లి జరుగుతుందని చెప్పినా వినలేదన్నారు. అల్ఫియాను బలవంతంగా లాక్కెళ్లారని.. అడ్డుకోబోయిన తనని పోలీసులు తోసేశారని అఖిల్‌ ఆరోపణలు చేశాడు.

Next Story