నిఫా వైరస్ విజృంభణ.. మాస్క్‌లు తప్పనిసరి చేసిన కేరళ

కేరళలో నిఫా వైరస్ కేసులు కలవరం సృష్టిస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  16 Sept 2024 5:31 PM IST
నిఫా వైరస్ విజృంభణ.. మాస్క్‌లు తప్పనిసరి చేసిన కేరళ

కేరళలో నిఫా వైరస్ కేసులు కలవరం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైరస్ కట్టడి కోసం కేరళ ప్రభుత్వ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిఫా వైరస్ కట్టడి కోసం ప్రతి ఒక్కరూ మాస్క్‌ పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

ముఖ్యంగా కేరళలోని మలప్పురంలో ఎక్కువగా నిఫా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నెల 9వ తేదీన 24 ఏళ్ల యువకుడు నిఫా వైరస్ కారణంగా చనిపోవడంతో అందర్లోనూ భయం మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు అప్రమత్తం అయ్యారు. పెరింతల్‌మన్నలోని ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను చనిపోయాడనీ.. మృతదేహానికి పరీక్షలు చేయగా నిఫా వైరస్ తేలిందని చెప్పారు. మరణానంతరం ప్రాంతీయ వైద్యాధికారి నిర్వహించిన దర్యాప్తులో నిఫా వైరస్‌ గురించి అనుమానం రావడంతో.. నమూనాలను పరీక్షల కోసం పంపించినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. కొజికోడ్‌లో నిర్వహించిన పరీక్షల్లో నిఫా వైరస్‌ పాజిటివ్‌ అని నిర్ధారణ అయిందని వివరించారు.

ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నిఫా మరణం సంభవించిన మలప్పురం జిల్లాలో మాస్కులను తప్పనిసరి చేశారు అధికారులు. ఈ ప్రాంతంతో పాటు తిరువలి పంచాయతీ పరిధిలోని నాలుగు వార్డుల్లో సినిమా థియేటర్లు, విద్యా సంస్థలను మూసివేయాల్సిందిగా ఆదేశించారు. జనాలంతా ఒక్కచోట గుమికూడొద్దని సూచించారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని జిల్లా అధికారులు వెల్లడించారు.

Next Story