కేరళలో అంబులెన్స్‌ను ఢీకొట్టిన మంత్రి ఎస్కార్ట్‌ వాహనం

కేరళలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శివన్‌ కుట్టి ఎస్కార్ట్‌ వాహనం అంబులెన్స్‌ను ఢీకొట్టింది.

By Srikanth Gundamalla  Published on  14 July 2023 1:47 PM IST
Kerala, Minister Escort, Dash, Ambulance,

కేరళలో అంబులెన్స్‌ను ఢీకొట్టిన మంత్రి ఎస్కార్ట్‌ వాహనం

మన దేశంలోనే రోడ్డుప్రమాదాల్లో ఎక్కువ మంది మరణిస్తుంటారు. కొన్నిసార్లు నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్ల తమ ప్రాణాలనే కాదు.. అవతలివారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇక ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. కేరళలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శివన్‌ కుట్టి ఎస్కార్ట్‌ వాహనం అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కొల్లాం దగ్గర కొట్టారక్కరా వద్ద జూలై 13న రోడ్డుప్రమాదం సంభవించింది. సిగ్నల్‌ సిస్టమ్‌ లేనట్లుంది అక్కడ పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి మంత్రి శివన్ కుట్టి వాహనం అటుగా వచ్చింది. దాంతో పోలీసులు అన్ని వైపులా వాహనాలను నిలిపివేశారు. ఉన్నట్లు ఎమర్జెన్సీగా అంబులెన్స్‌ వాహనం వేగంగా దూసుకొచ్చింది. పోలీసులు దాన్ని చూసే సరికి దాదాపు సిగ్నల్‌ మధ్యలోకి వచ్చేసింది. ఇక మంత్రి శివన్‌ వాహనం ముందున్న ఎస్కార్ట్‌ వాహనం నేరుగా వచ్చి అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ట్రాఫిక్‌ను మళ్లిస్తున్న పోలీసులు సమన్వయం లోపించడం, అంతేకాక సిగ్నల్‌ను చూసుకోకుండా వేగంగా అంబులెన్స్‌ను నడపడం, నిర్లక్ష్యంగా పోలీసు ఎస్కార్ట్‌ వాహనం నడపడం ఈ ప్రమాదానికి కారణాలు అయ్యాయి. అయితే.. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్‌ పల్టీ కొట్టింది. కాస్తుంటే ట్రాఫిక్‌ నియంత్రిస్తున్న పోలీస్‌ అధికారిపైకి దూసుకెళ్లేది. అతను పక్కకు జరగడంతో ప్రమాదం తప్పింది. ఇక అంబులెన్స్‌లో ఉన్న రోగి, ఆమె భర్తకు గాయాలు అయ్యాయని తెలుస్తోంది. వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారని పోలీసులు వివరించారు.

ఈ సంఘటన కేరళలో వివాదాస్పదం అవుతోంది. రోడ్డుప్రమాదం జరిగాక అక్కడ అంబులెన్స్‌లో ఉన్నవారి పరిస్థితి గురించి ఆలోచించకుండా మంత్రి శివన్ కుట్టి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దాంతో.. మంత్రి శివన్‌ కుట్టి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. ప్రతిపక్ష నాయకులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు కూడా వీడియోను చూసి మానవత్వం లేకుండా ప్రజాప్రతినిధి అలా ఎలా వెళ్లిపోతారంటూ ప్రశ్నిస్తున్నారు.

రోడ్డుప్రమాద ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. సిగ్నల్‌ క్లియర్‌గా ఉందా లేదా అని చూసుకోకుండా ర్యాష్‌, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌, ఎస్కార్ట్ వాహనం నడుపుతున్న పోలీసు అధికారిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. మరోవైపు అంబులెన్స్‌ డ్రైవర్‌ పోలీసులపై ఆరోపణలు చేస్తున్నాడు. కేసు నమోదు విషయంలో తనతో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని అంబులెన్స్‌ డ్రైవర్ వాపోయాడు.

Next Story