వరించిన అదృష్టం..చిల్లర పోగేసి కొన్న లాటరీకి రూ.10కోట్ల జాక్‌పాట్

కేరళలో 11 మంది మహిళలను అదృష్టం వరించింది. రూ.250 పోగేసి కొన్న లాటరీకి జాక్‌పాట్‌ తగిలింది. ఏకంగా రూ.10 కోట్లు గెలుచుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  28 July 2023 6:52 AM GMT
Kerala, Lottery, 11 Women, won Rs 10 Crore,

 వరించిన అదృష్టం..చిల్లర పోగేసి కొన్న లాటరీకి రూ.10కోట్ల జాక్‌పాట్

అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో చెప్పలేం అంటుంటారు. అవును అది నిజమే. నిన్నటి వరకు ఏమీ లేని వ్యక్తులు ఓవర్‌ నైట్‌లో స్టార్లు అయ్యారు. ఉన్నట్లుండి కోటీశ్వరులు అయినవారూ ఉన్నారు. కొందరు లాటరీల్లో గెలిచిన డబ్బులతో బిలియనీర్లుగా మారారు. తాజాగా కేరళలో 11 మంది మహిళలను అదృష్టం వరించింది. వాళ్ల దగ్గర డబ్బులు లేకపోయినా.. రూ.250 పోగేసి కొన్న లాటరీకి జాక్‌పాట్‌ తగిలింది. ఏకంగా రూ.10 కోట్లు గెలుచుకున్నారు. దాంతో.. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వార్త కూడా సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

కేరళలోని పరప్పన్‌ గడి మన్సిపాలిటీలో హరిత కర్మసేన తరఫున కొందరు పేద మహిళలు పని చేస్తున్నారు. వీరు భూమిలో కలిసిపోని వ్యర్థాలను ఇళ్లు, ఆఫీసుల నుంచి సేకరించి రీసైక్లింగ్‌ కోసం యూనిట్లకు పంపిస్తారు. అయితే.. ఇందులో పని చేసే 11 మంది మహిళలు లాటరీ టికెట్‌ కొని అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నారు. లాటరీకి కావాల్సిన రూ.250 డబ్బులు మొత్తం కూడా వారి దగ్గర లేవు. అందరి దగ్గర కలిపినా రూ.25 మాత్రమే జమ అయ్యాయి. దాంతో.. అప్పు అడిగి అయినా సరే లాటరీ కొనాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఎలాగోలా లాటరీకి కావాల్సిన మొత్తం రూ.250 సేకరించి టికెట్‌ కొనుగోలు చేశారు.

వారు పేదరికం నుంచి బయటపడేలా అదృష్టం వారిని వరించింది. కేరళ లాటరీ డిపార్ట్‌ మెంట్‌ గత బుధవారం డ్రా తీయగా.. లక్కీగా 11 మంది మహిళలు కొన్ని టికెట్‌కే జాక్‌పాట్ తగిలింది. రూ.10 కోట్లు గెలుచుకున్నారు. దాంతో.. సదురు మహిళల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ డబ్బుతు తమ అందరి జీవితాలు మారతాయని.. పేదరికం నుంచి బయటపడతామని అంటున్నారు. లాటరీలో వచ్చిన డబ్బుతో ఇళ్ల నిర్మాణం, పిల్లల చదువులకు, అప్పులు తీర్చుకుంటామని చెబుతున్నారు. వచ్చిన మొత్తాన్ని సమానంగా పంచుకుంటామని మహిళలు అంటున్నారు.


Next Story