ప్రముఖ మళయాళ నటుడు దిలీప్‌కు శబరిమల దర్శన సమయంలో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు, రాష్ట్ర పోలీసులు వీఐపీ సదుపాయాలను అందించడాన్ని కేరళ హైకోర్టు తప్పుబట్టింది. దిలీప్ డిసెంబర్ 5న శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. ఆయన దర్శనానికి వచ్చినప్పుడు ఎంతో మంది అయ్యప్పలు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. పిల్లలు, వృద్ధులు కూడా కొన్ని గంటల పాటూ వేచి ఉండాల్సి వచ్చింది. ఓ నటుడికి ఇలా ప్రత్యేక సదుపాయాలను కల్పించడంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు నటుడు పోలీసు ఎస్కార్ట్‌లతో ప్రత్యేక ప్రవేశం ఎలా పొందారని కోర్టు ప్రశ్నించింది.
వీఐపీ దర్శనం విషయంలో ఇది సరైన పద్ధతి కాదని ట్రావెన్ కోర్ బోర్డును హై కోర్టు మందలించింది. నటుడు ఆలయంలో ఎక్కువసేపు ఉండటానికి ఎలా అనుమతిచ్చారని బోర్డు ప్రశ్నించడమే కాకుండా యాజమాన్యం చర్యలు కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.శబరిమలలో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులకు మాత్రమే వీఐపీ దర్శనం కల్పించాల్సి ఉంటుందని ఇతరులకు ప్రత్యేక దర్శనం కల్పించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది కోర్టు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ, నివేదికను కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తులు జస్టిస్ నరేంద్రన్, జస్టిస్ మురళీ కృష్ణలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. డిసెంబర్ 9 లోగా నివేదిక సమర్పించాలని టీడీబీని కోర్టు ఆదేశించింది.