Kerala: హైపటైటిస్-ఎ వైరస్ కలవరం, 12 మంది మృతి
కేరళలో హైపటైటిస్-ఎ వైరస్ కలవరం సృష్టిస్తోంది.
By Srikanth Gundamalla Published on 16 May 2024 2:50 PM ISTKerala: హైపటైటిస్-ఎ వైరస్ కలవరం, 12 మంది మృతి
కేరళలో హైపటైటిస్-ఎ వైరస్ కలవరం సృష్టిస్తోంది. కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. కాగా... ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే కేరళలో 1,977 హైపటైటిస్-ఎ వైరస్ కేసులు నమోదు అయినట్లు కేరళ ఆరోగ్యశాఖ వివరించింది. అత్యధికంగా ఈ వైరస్ కేసులు కోజికోడ్, మలప్పురం, త్రిసూర్, ఎర్నాకులం జిల్లాల్లో బయటపడినట్లు వెల్లడించింది. హైపటైటిస్-ఎ వైరస్ బారిన పడిన వారు అనారోగ్యానికి గురికావడమే కాక.. ప్రాణాలు కోల్పోతుండటంతో ఆరోగ్యశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు ప్రజలకు పలు సూచనలు చేశారు.
కేరళలో ఈ వైరస్ ప్రభావం ఉన్న నాలుగు జిల్లాలు కోజికోడ్, మలప్పురం, త్రిసూర్, ఎర్నాకులంకి హెచ్చరికలు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు. ఈ జిల్లాల్లో వెంటనే వైరస్‌ను కట్టడి చేసేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఈ మేరకు అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు. వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నీటి వనరులను క్లోరినేషన్ చేసి, రెస్టారెంట్లకు హీట్ వాటర్‌ను మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఈ వైరస్ ప్రభావం ఇతర ప్రాంతాల్లోకి వ్యాపించకముందే అరికట్టాలని మంత్రి వీణా జార్జ్ అధికారులకు చెప్పారు.
కేరళలో కలవరపెడుతున్న హైపటైటిస్-ఎ వైరస్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కలుషితమైన ఆహారం, నీటి ద్వారా, ఈ వైరస్ సోకిన వ్యక్తితో ప్రత్యేక సంబంధం పెట్టుకుంటే వ్యాపిస్తుందని చెప్పారు. ఇక హెచ్‌ఐవీ, కాలేయ వ్యాధితో బాధపడుతున్నవారు హైపటైటిస్-ఎ వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉందని చెప్పారు. దీని ప్రభావం వల్ల అలసట, కడుపు నొప్పి, జ్వరం, వికారం, వాంతులు, విరేచనాలు, ఆకలి లేకపోవడం, దురద, కామెర్లు వంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. వైరస్ బారిన వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కాచ్చి చల్లార్చిన నీళ్లను తాగాలంటున్నారు. బహిరంగ మలవిసర్జనకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక ఆహారం తినే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలని.. తద్వారా హైపటైటిస్-ఎ బారిన పడకుండా ఉండొచ్చిన చెబుతున్నారు.